ఇరాన్ సూపర్ దాడి చేసిందా..?
టెల్ అవీవ్‌పై క్షిపణుల వర్షం
హైఫా రక్షణ కేంద్రాలే లక్ష్యం
ప్రతిదాడులతో ఇజ్రాయెల్ కౌంటర్
రంగంలోకి దిగిన హెజ్బుల్లా సేనలు
ప్రాంతీయ యుద్ధ భయం పెరుగుతోంది
కాకతీయ, నేషనల్ డెస్క్ : ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు మూడో రోజుకు చేరుకుని మరింత ఉధృతమయ్యాయి. పరస్పరం క్షిపణి దాడులు కొనసాగుతుండగా, పరిస్థితి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. తాజా దాడిని ఇరాన్ “సూపర్ దాడి”గా ప్రకటించడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇజ్రాయెల్ కూడా వెంటనే ప్రతిస్పందిస్తూ వైమానిక దాడులు ప్రారంభించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ దళాలు విడుదల చేసిన ప్రకటనలో టెల్ అవీవ్‌లోని ప్రభుత్వ సముదాయం, హైఫాలోని రక్షణ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు ప్రయోగించినట్లు పేర్కొన్నాయి. ఈ దాడికి ప్రత్యేక కోడ్ పేరును కూడా వెల్లడించాయి. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకున్నామని, దాని ఫలితాలపై స్పష్టత లేదని ఇరాన్ వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో ఇజ్రాయెల్ వైమానిక దళాలు ఇరాన్‌లోని కీలక సైనిక స్థావరాలపై దాడులు చేసినట్లు సమాచారం. టెహ్రాన్ పరిసరాల్లో పేలుళ్లు సంభవించినట్లు అంతర్జాతీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థలు పలు క్షిపణులను అడ్డుకున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో నష్టం జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అమెరికా స్థావరాలపై అప్రమత్తత
గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై కూడా ముప్పు ఉందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. కువైట్, బహ్రెయిన్ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. గల్ఫ్ సముద్రంలో నౌకాదళ కదలికలు పెరిగినట్లు సమాచారం. అమెరికా తమ సైనికులకు అదనపు రక్షణ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో ఘర్షణ మరింత విస్తరించే అవకాశముందనే ఆందోళన పెరుగుతోంది. ఇరాన్ తనపై జరిగిన దాడులకు తగిన ప్రతిస్పందన ఇస్తున్నామని ప్రకటిస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ భద్రతకు భంగం కలిగించే ఏ చర్యనైనా కఠినంగా తిప్పికొడతామని స్పష్టం చేసింది. రెండు దేశాల ప్రకటనలు పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో స్పష్టం చేస్తున్నాయి.
హెజ్బుల్లా రంగంలోకి
లెబనాన్ కేంద్రంగా పనిచేసే హెజ్బుల్లా సంస్థ కూడా ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులు ప్రారంభించినట్లు సమాచారం. ఉత్తర సరిహద్దుల్లో అలర్ట్ సైరన్లు మోగుతున్నాయని వార్తలు చెబుతున్నాయి. ఇరాన్‌కు మద్దతుగా ఉన్న ఈ సంస్థ రంగంలోకి దిగడంతో పరిస్థితి ప్రాంతీయ యుద్ధంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూడో రోజుకి చేరుకున్న ఈ ఘర్షణల్లో ఎక్కడా వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. అంతర్జాతీయ సమాజం మాత్రం ఇరు దేశాలు శాంతి మార్గం వైపు రావాలని పిలుపునిస్తోంది. ఐక్యరాజ్య సమితి సహా పలువురు దేశాలు ఉద్రిక్తతలు తగ్గించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో యుద్ధ మబ్బులు కమ్ముకున్నాయి. పరిస్థితి మరింత విషమిస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం పడే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. చమురు సరఫరా మార్గాలు, వాణిజ్య కార్యకలాపాలు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇకపై పరిణామాలు ఎలా మలుపుతీసుకుంటాయన్నది అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా గమనిస్తోంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లబడతాయా, లేక మరింత తీవ్రమవుతాయా అన్నది వచ్చే రోజుల్లో తేలనుంది.


