కాకతీయ, పరకాల: పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం పరకాల ఇందిరా మహిళా డైరీ దామెర, ఆత్మకూరు నడికూడ, పరకాల మండలాల గ్రామ, ప్రాదేశిక స్థాయి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలకు అవగాహన, సన్నాహక సమావేశంలో ముఖ్యఅతిథిగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డైరీ ఆవశ్యకత, నిర్మాణం, యజమాని బాధ్యతలు, పాల ఉత్పత్తి పాల మార్కెటింగ్ పై అవగాహన కల్పించడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు. ప్రాథమిక సొసైటీలో డైరీ పట్ల అవగాహన ఉండాలని తెలిపారు. ఈ డైరీ ఏర్పాటుకు రాష్ట్ర, యంత్రాంగ కృషి ఎంతో ఉందన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించిన ఆడబిడ్డల రుణం తీర్చుకునేందుకు ఈ డైరీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
రాజకీయాలకు అతీతంగా పరకాల డైరీనీ అభివృద్ధి చేసుకుందామని అన్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, మహిళా సంఘాలు ఆర్థికంగా బలపడాలంటే పాడి పరిశ్రమలు అభివృద్ధి చేసుకోవాలన్నారు. సమాజానికి ఆరోగ్యపరమైన జీవితాన్ని అందించడమే పరకాల ఇందిరా మహిళా డైరీ ముఖ్య ఉద్దేశమని అన్నారు.


