కాకతీయ, కరీంనగర్ః- దీపిక హాస్పటల్‌ను మూసివేసి ఆస్పత్రి నిర్వహకులపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ, ఏఐవైఎఫ్ గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. వైద్యం కోసం వచ్చిన మహిళకు మత్తు ఇచ్చి అత్యాచారం చేసిన కౌంపౌండర్, ఆసుపత్రి నిర్వహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డివైఎఫ్ఐ, ఏఐవైఎఫ్ నాయకులు సోమవారం రోజున కరీంనగర్ జిల్లా కేంద్రంలోని దీపిక ఆసుపత్రి ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్బంగా డివైఎఫ్ఐ, ఏఐవైఎఫ్ నాయకులు భీమా సాహెబ్, తిరుపతి, యుగందర్, రాజు నాయక్‌లు మాట్లడుతూ.. నగరం నడి ఒడ్డులో ఉన్న దీపిక ఆసుపత్రిలో జ్వరంతో భాదపడుతూ ఆసుపత్రికి వచ్చిన మహిళకు మత్తు మందు ఇచ్చి, లైంగిక దాడికి పాల్పడి అత్యాచారం చేసిన కాంపౌండర్ దక్షిణపై, ఆసుపత్రి నిర్వహకులు డాక్టర్ వెంకటేశ్వర్లు పై క్రిమినల్ కేసులు నమోదు చేసి తక్షణమే రిమాండ్ చేయాలని, ఆసుపత్రిక రిజిస్ట్రేషన్ రద్దు చేసి ఆసుపత్రిని మూసి వేయాలని వారు డిమాండ్ చేశారు.
ఆస్పత్రిలో అర్హులైన సిబ్బందిన పెట్టకుండా అర్హత లేని వారిని పెట్టి రోగుల ప్రాణాలో చెలగాటమాడుతున్న హాస్పటల్ యాజమాన్యం పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జ్వరంతో ఆసుపత్రిలో అడ్మిట్ అయిన మహిళ పై లైంగిక దాడి, అత్యాచారం చేసినా నిందితున్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ వేగవంతం చేసి నిందితుడిని శిక్ష పడే విధంగా జిల్లా అధికారులు బాధ్యత తీసుకోవాలని ప్రభుత్వాన్ని వారు కోరారు. ఆస్పత్రి నిర్వహకులు నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్న చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న నిర్వాహకులపై కూడా క్రిమినల్ కేసు నమోదు చేసి రిమాండ్ చేయాలని వారు కోరారు.
జిల్లా వైద్య శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించకపోవడం, శాఖపరమైన చర్యలు తీసుకోకపోవడం వలన వైద్య శాఖ అధికారుల వైఫల్యం వలనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి నిర్వహకులు అనుమతి తీసుకోకుండా అనుమతి కొరకు చేసిన దరఖాస్తల ద్వారానే ఆసుపత్రులు ప్రారంభింస్తున్నారని, ఆపరేషన్లు చేసి వైద్యం వికటించి ప్రాణాలు కోల్పోతున్న రోగుల గురించి వైద్యాధికారుల దృష్టికి తీసుకుపోయిన నేటి వరకు చర్యలు తీసుకొన్న దాఖలు లేవని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ, సంతాన సౌపల్య కేంద్రాలు రకరకాల పేర్లు పెట్టుకుని అర్హులైన సిబ్బందిని పెట్టకుండా వైద్యాన్ని వ్యాపార పరం చేస్తున్న హాస్పటల్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవడంలో వైద్యాధికారులు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని అధికారులను ప్రశ్నించారు.
పాలన అధికారులు, ప్రభుత్వాలు ఇప్పటికైనా నిజనిర్ధారణ కమిటీలు పెట్టి ప్రైవేట్ హాస్పిటల్ లో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా దీపిక హాస్పిటల్ అనుమతిని రద్దుచేసి ఆసుపత్రిని మూసివేసి నిందితుడ్ని, హాస్పిటల్ నిర్వహకుల డాక్టర్ వెంకటేశ్వర్లు పై చట్టపరమైన చర్యలు తీసుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళనలు మరింతం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మోహన్ నాయక్, రవీందర్ నాయక్, లక్పతి నాయక్, భాస్కర్ నాయక్, రాజన్, చెంచర్ల మురళి, అవినాష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.


