ధర్మపురి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ఈనెల 27 నుంచి మార్చి 11 వరకు వేడుకలు
తొలి రోజు అంకురార్పణతో షురూ..
కాకతీయ, జగిత్యాల : జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, జాతర మహోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 11 వరకు పదమూడు రోజులపాటు వైభవంగా నిర్వహించనున్న ఈ ఉత్సవాల్లో ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, వాహన సేవలు, డోలోత్సవాలు, రథోత్సవం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగనున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ధర్మపురి క్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు వైదిక ఘట్టాలతో ఘనంగా కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 27న పుణ్యాహవాచనం, అంకురార్పణ, కలశస్థాపన, అగ్ని ప్రతిష్ఠ వంటి కార్యక్రమాలతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఫిబ్రవరి 28న ఉదయం స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. మార్చి 1న స్వామివారి ప్రత్యేక వాహన సేవ, మార్చి 2న వాహనోత్సవం, మార్చి 3న ప్రత్యేక పూజలతో పాటు సాయంత్రం డోలోత్సవం జరుగుతుంది. మార్చి 4, 5, 6 తేదీల్లో స్వామివారి వాహన సేవలు, డోలోత్సవాలు, ఉత్సవ విగ్రహాల ఊరేగింపులు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తనున్నాయి. మార్చి 5న జరిగే రథోత్సవం జాతరలో ప్రధాన ఆకర్షణగా నిలవనుండగా వేలాది మంది భక్తులు పాల్గొనే ఈ మహోత్సవం వైభవంగా జరుగనుంది. మార్చి 7న చక్రస్నానోత్సవం, మార్చి 8న ముక్కోటి ఉత్సవాలు నిర్వహిస్తారు. మార్చి 9, 10 తేదీల్లో ప్రత్యేక పూజలు, వాహన సేవలు కొనసాగుతాయి. మార్చి 11న పూర్ణాహుతి, సమాప్తి కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
భక్తులకు విస్తృత సదుపాయాలు
బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ప్రత్యేక దర్శనాలు, నిత్యకళ్యాణాలు సక్రమంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల రోజుల్లో భారీగా భక్తులు తరలివచ్చే అవకాశముండటంతో క్షేత్ర పరిసరాల్లో విస్తృత ఏర్పాట్లు చేశారు. అన్నదాన కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతుండగా, తాగునీటి సదుపాయం, వైద్య సేవలు, రవాణా సౌకర్యాలు, పార్కింగ్ ఏర్పాట్లు, భద్రతా బందోబస్తు చర్యలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమగ్ర ఏర్పాట్లు పూర్తి చేశారు.


