ధరణి–భూభారతి స్కామ్ గుట్టు రట్టు
15 మంది అరెస్టు… మరో 9 మంది పరారీ
రూ.63.19 లక్షల నగదు, కోట్ల ఆస్తులు స్వాధీనం
జనగామ–యాదాద్రిలో భారీగా రిజిస్ట్రేషన్ల మోసం
నకిలీ చలాన్లతో 1,080 రిజిస్ట్రేషన్లు
రూ.3.90 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి
22 కేసులు నమోదు… వివరాలు వెల్లడించిన కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్
కాకతీయ, వరంగల్ బ్యూరో : ధరణి, భూభారతి రిజిస్ట్రేషన్లలో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టిన కుంభకోణాన్ని జనగామ పోలీసులు బట్టబయలు చేశారు. జనగామ, యాదాద్రి–భువనగిరి జిల్లాల్లో రూ.3.90 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయాన్ని కాజేసిన ముఠాకు చెందిన 15 మందిని పోలీసులు అరెస్టు చేయగా, మరో తొమ్మిది మంది పరారీలో ఉన్నారు. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ముఠా సభ్యుల వద్ద నుంచి పోలీసులు రూ.63.19 లక్షల నగదు, బ్యాంకులో ఉన్న రూ.1 లక్ష, సుమారు రూ.1 కోట్ల విలువైన ఆస్తి పత్రాలు, ఒక కారు, రెండు ల్యాప్‌టాప్‌లు, ఐదు డెస్క్‌టాప్ కంప్యూటర్లు, 17 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో పసునూరి బసవ రాజు (32), జెల్లా పాండు (46), మహేశ్వరం గణేష్ కుమార్ (39), ఈగజులపాటి శ్రీనాథ్ (35), యెనగంధుల వెంకటేష్, కోదురి శ్రావణ్ (35), కొలిపాక సతీష్ కుమార్ (36), తడూరి రంజిత్ కుమార్ (39), దుంపల కిషన్ రెడ్డి (29), దశరథ్ మేఘావత్ (28), నారా భాను ప్రసాద్ (30), గొపగాను శ్రీనాథ్ (32), శివ కుమార్ (33), ఒగ్గు కర్నాకర్ (42), అలేటి నాగరాజు (32) ఉన్నారు. వీరంతా జనగామ, యాదాద్రి జిల్లాలకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.

ఇలా సాగిన మోసాల బాట…
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ శుక్రవారం హన్మకొండలోని కమిషనరేట్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాన నిందితులైన పసునూరి బసవ రాజు, జెల్లా పాండు యాదగిరిగుట్ట ప్రాంతంలో ఆన్‌లైన్ సర్వీస్ సెంటర్లు నిర్వహించేవారు. గణేష్ అనే వ్యక్తి మధ్యవర్తిగా వ్యవహరిస్తూ, రైతుల నుంచి రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన డబ్బును మీసేవ, ఆన్‌లైన్ సెంటర్ల ద్వారా వసూలు చేసేవాడు. ఆ మొత్తంలో కొంత భాగాన్ని కమిషన్లుగా మద్యవర్తులకు ఇచ్చి, మిగిలిన డబ్బును ప్రధాన నిందితులకు పంపేవాడు. బసవ రాజు ధరణి, భూభారతి వెబ్‌సైట్‌లోని “ఇన్‌స్పెక్ట్ – ఎడిట్ అప్లికేషన్”ను దుర్వినియోగం చేసి, చెల్లించాల్సిన చలాన్ మొత్తాన్ని తగ్గించేవాడు. ఆ తర్వాత మొబైల్ యాప్‌ల సహాయంతో నకిలీ చలాన్లు తయారు చేసి రైతులకు పంపించేవారు. చెల్లించాల్సిన రుసుముకన్నా తక్కువగా మార్పు చేసిన చలాన్లను మాత్రమే ప్రభుత్వానికి చెల్లించి, మిగిలిన మొత్తాన్ని జేబుల్లో వేసుకునేవారు.

1,080 రిజిస్ట్రేషన్లలో మోసం
ఈ నకిలీ చలాన్లను స్థానిక ఎమ్మార్వో, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మద్యవర్తుల ద్వారా సమర్పిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్లు పోలీసులు గుర్తించారు. జనగామ, యాదాద్రి జిల్లాల్లో మొత్తం 1,080 రిజిస్ట్రేషన్ పత్రాలకు సంబంధించి మోసాలు జరిగినట్లు తేలింది. ఈ కుంభకోణంపై మొత్తం 22 కేసులు నమోదు కాగా, వాటిలో జనగామ జిల్లాలో 7, యాదాద్రి జిల్లాలో 15 కేసులు ఉన్నాయి. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఈ ముఠా మీ సేవ, ఆన్‌లైన్ సర్వీసులు, మద్యవర్తుల వద్దకు రావాల్సిన ధరణి, భూభారతి రిజిస్ట్రేషన్ పత్రాలను తమ వద్దకే తీసుకుని నమోదు చేసేదని పోలీసులు తెలిపారు. ప్రతి రిజిస్ట్రేషన్‌లో 10 నుంచి 30 శాతం వరకు కమిషన్లుగా పంచుకుంటూ ఈ అక్రమాలకు పాల్పడ్డారని వెల్లడించారు. ఈ భారీ స్కామ్‌ను ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏఎస్పీ పండరి చేతన్, ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి, రఘునాథపల్లి సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఇతర ఎస్‌ఐలు, సిబ్బందిని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ప్రత్యేకంగా అభినందించారు.


