కాకతీయ, సినిమా: 2025 అక్టోబర్ 24: కోలీవుడ్ స్టార్ ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ` ఇడ్లీ కొట్టి`. ఈ సినిమాకు దర్శకుడిగా కూడా ఆయనే వ్యవహరించారు. నిత్యా మీనన్ కథానాయిక కాగా.. అరుణ్ విజయ్, షాలిని పాండే, సత్యరాజ్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. ఇప్పటికే ధనుష్, నిత్యా మీనన్ కాంబోలో వచ్చిన ` తిరు` బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. దీంతో వీరి లేటెస్ట్ ఫిల్మ్ ఇడ్లీ కొట్టుపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
కానీ, దీపావళీ కానుకగా అక్టోబర్ 1న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఇప్పుడు నెల తిరక్క ముందే ఇడ్లీ కొట్టు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మేకర్స్ అధికారిక ప్రకటన ప్రకారం, ఇడ్లీ కొట్టు అక్టోబర్ 29 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ సైతం కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది. థియేటర్‌కు వెళ్ళలేని ప్రేక్షకులు ఈ డీజిటల్ వేదిక ద్వారా సినిమాను ఆనందించవచ్చు.
అసలు కథ ఏంటి..
మురళి (ధనుష్) ఒక సింపుల్, సాధారణ వ్యక్తి. అతని తండ్రి శివకేశవులు (రాజ్ కిరణ్) చిన్న ఊరులో ఇడ్లీ కొట్టును నడిపిస్తుంటారు. ఆ ఊళ్లో అతని ఇడ్లీ కొట్టు చాలా ఫేమస్. మురళి తన వ్యక్తిగత లక్ష్యాల కోసం, తండ్రి పని చేస్తున్న ఇడ్లీ కొట్టును ఫ్రాంచైజీలా మార్చి ఇతర చోట్ల హోటల్స్ ప్రారంభించి డబ్బు సంపాదించాలని కలలు కనుకుంటాడు. తండ్రి దీన్ని అంగీకరించకపోవడంతో, మురళి ఊరును, కన్నతల్లిదండ్రులను వదిలి బ్యాంకాక్ వెళ్లిపోతాడు. అక్కడ విష్ణు వర్థన్ (సత్యరాజ్)కి సంబంధించిన హోటల్స్‌లో పనిచేసి వాళ్ల కంపెనీని లాభాల బాటపట్టిస్తాడు. ఈ క్రమంలోనే విష్ణు వర్థన్ తన కూతురు మీరా(షాలిని పాండే)ను మురళికి ఇచ్చి పెళ్లి చేయాలని డిసైడ్ అవుతాడు. కొద్ది రోజుల్లో పెళ్లి అనగా శివకేశవులు చనిపోతాడు. అతను ప్రాణంగా చూసుకున్న ఇడ్లీ కొట్టు కూడా మూతపడుతుంది. తండ్రి మరణంతో ఊరికి వచ్చిన మురళి ఎందుకు తిరిగి దుబాయ్ వెళ్లలేదు? మూతపడిన ఇడ్లీ కొట్టును ఎలా నిలబెట్టాడు? అతనికి కళ్యాణి (నిత్యామీనన్) అందించిన ప్రోత్సహం ఏంటి? అసలు అశ్విన్ (అరుణ్ విజయ్) ఎవరు? మురళితో అతనికి గొడవేంటి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. వ్యక్తిగత ఆశలు, తండ్రి వారసత్వం, ప్రేమ మధ్య నడిచే హృదయాన్ని తాకే ప్రయాణమే ఇడ్లీ కొట్టు. గ్రామీణ నేపథ్యంలో సింపుల్ కథనంతో ఈ మూవీని తెరకెక్కించారు.


