మేడారం జాతరకు పోటెత్తిన భక్తజనం
సౌకర్యాల పరిశీలనలో మంత్రి సీతక్క
తప్పిపోయిన చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగింత
కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా మేడారం గిరిజన జాతర ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సెలవు రోజు కావడంతో తెలంగాణతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల నుంచి అమ్మవార్ల దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జాతర ప్రాంగణంలో రాష్ట్ర మంత్రి సీతక్క పర్యటించి అభివృద్ధి పనులు, భక్తులకు కల్పించిన సౌకర్యాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రవాణా, తాగునీరు, వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా జంపన్నవాగు సమీపంలో తప్పిపోయిన ఓ చిన్నారి మంత్రి కంటపడింది. చిన్నారిని అక్కున చేర్చుకొని ధైర్యం చెప్పిన మంత్రి, వెంటనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇచ్చి కుటుంబ సభ్యులను గుర్తించారు. అనంతరం చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. మంత్రి చూపిన మానవీయతకు భక్తులు ప్రశంసలు కురిపించారు.


