శంభుని గుడికి భక్తుల కానుకల వర్షం
మహాశివరాత్రి సందర్భంగా 8 హుండీల లెక్కింపు పూర్తి
హుండీల ద్వారా రూ.1,17,940 నగదు ఆదాయం నమోదు
ప్రత్యేక దర్శనం, అభిషేకాలతో రూ.94,600 అదనపు వసూళ్లు
కాకతీయ, ఖిలా వరంగల్ : మహాశివరాత్రి సందర్భంగా ఖిలా వరంగల్ మధ్యకోటలోని చారిత్రక శ్రీ స్వయంభు శంభూలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీతో పాటు ఆదాయం గణనీయంగా పెరిగింది. వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఎనిమిది హుండీలను గురువారం ఎండోమెంట్ ఈవో వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో లెక్కించగా మొత్తం రూ.1,17,940 నగదు లభించింది. భక్తుల విశ్వాసానికి నిదర్శనంగా కొంత వెండి, ఒక అమెరికన్ డాలర్‌తో పాటు కోరికల చిట్టీలు కూడా లభించాయి. హుండీ లెక్కింపు కార్యక్రమం స్థానిక కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్, ఆలయ చైర్మన్ బంగారి శ్రీనివాస్, ధర్మకర్త సిరబోయిన గిరి, ప్రధాన అర్చకులు శంభూలింగం తదితరుల సమక్షంలో పారదర్శకంగా నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవడంతో ఆలయానికి మంచి ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.
ప్రత్యేక సేవలతో అదనపు ఆదాయం
మహాశివరాత్రి రోజున నిర్వహించిన ప్రత్యేక దర్శనం, అభిషేకం సేవల ద్వారా మరో రూ.94,600 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు అధికంగా ఆసక్తి చూపడంతో ఈ ఆదాయం లభించినట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధికి దాతలు ముందుకు రావడం విశేషంగా నిలిచింది. నలివెల కోటేశ్వర్లు రూ.36 వేలతో ఆలయానికి సున్నాలు వేయించగా, ఎనబోతుల రాజేష్ రూ.25 వేల విలువైన పాండాలు సమకూర్చారు. తీగల శ్రీధర్ ఆలయాన్ని పూలతో అలంకరించగా, సూర్యతేజ 100 మంది భక్తులకు అన్నదానం నిర్వహించారు. మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో మున్సిపాలిటీ అన్ని ఏర్పాట్లు చేసినట్లు కార్పొరేటర్ సువర్ణ సురేష్ తెలిపారు. కార్యక్రమ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆలయ కమిటీ ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పోలీసు సిబ్బంది, ఎండోమెంట్ సిబ్బంది పాల్గొన్నారు.


