మేడారానికి పోటెత్తిన భక్తులు
మహాజాతరకు నెలముందు నుంచే రద్దీ
ఆదివారం కావడంతో వేలాదిగా తరలివచ్చిన భక్తులు
రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిన దృశ్యం
పోలీసుల పకడ్బందీ ఏర్పాట్లతో సాఫీగా దర్శనం
కాకతీయ, ములుగు ప్రతినిధి : ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ ఆలయం వద్ద ఆదివారం భక్తుల రద్దీ పోటెత్తింది. జాతరకు ఇంకా నెల రోజుల సమయం ఉన్నప్పటికీ, వేలాదిగా భక్తులు ముందుగానే మేడారానికి తరలివచ్చి వనదేవతలను దర్శించుకున్నారు. మేడారం మహా జాతర 2026 జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్న నేపథ్యంలో… జాతరకు నెల రోజుల ముందే జాతర సందడి మొదలైంది. ఉదయం నుంచే మేడారం వెళ్లే ప్రధాన రహదారులపై వాహనాలు బారులు తీరాయి. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ ఆలయం వద్ద మొక్కులు చెల్లించుకున్న భక్తులు అక్కడి నుంచి మేడారం బాట పట్టారు. కార్లు, ఆటోలు, బస్సులు, ద్విచక్ర వాహనాలతో రహదారులు కిక్కిరిసిన దృశ్యం కనిపించింది. రాష్ట్ర ప్రభుత్వం మేడారం సమ్మక్క–సారలమ్మ ఆలయాన్ని పునర్నిర్మిస్తున్న క్రమంలో, పనులు కొనసాగుతూనే ఉండగా భక్తుల రద్దీ మరింత పెరిగింది. సాధారణంగా జాతర సమీపంలోనే కనిపించే జనసంద్రం… ఈసారి నెల రోజుల ముందే దర్శనమిచ్చింది. అడవుల్లోంచి, గ్రామాల నుంచి కుటుంబాలతో తరలివచ్చిన భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించారు.

పోలీసుల పకడ్బందీ ఏర్పాట్లు
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా పోలీసు యంత్రాంగం ముందస్తుగా పకడ్బందీ ప్రణాళిక అమలు చేసింది. జిల్లా ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకాన్ పర్యవేక్షణలో సుమారు 200 మంది పోలీస్ సిబ్బంది బందోబస్త్‌లో పాల్గొన్నారు. అదనపు ఎస్పీలు శివమ్ ఉపాధ్యాయ, సదానందం, ఏఎస్పీ మనన్‌బట్, డీఎస్పీలు, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్ఐలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. ఆలయం చుట్టుపక్కల ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేయడంతో పాటు, క్రౌడ్ మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. సూచిక బోర్డులు, మార్గదర్శక సిబ్బంది, ఆడియో అనౌన్స్‌మెంట్లతో భక్తులను క్రమబద్ధంగా నడిపించారు. దీంతో భారీ రద్దీ ఉన్నప్పటికీ దర్శనాలు ప్రశాంతంగా, సాఫీగా సాగాయి. భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నిర్వహణ పట్ల భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తూ… ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవార్ల దర్శనం కలిగిందని ఆనందం వ్యక్తం చేశారు. జాతరకు ఇంకా నెల రోజుల సమయం ఉండగానే మేడారం జనసంద్రంగా మారడం… ఈసారి మహా జాతర మరింత వైభవంగా సాగనుందన్న సంకేతాలను ఇస్తోంది.


