కాకతీయ, సికింద్రాబాద్: సికింద్రాబాద్ బోయిగూడా మెట్టుగూడా పద్మారావు నగర్ లో నేటి నుండి దేవినవరాత్రులు ప్రారంభమవుతున్న వేళ వాడ వాడలా అమ్మవారి మండపాలు వెలిసాయి. ప్రత్యేక విద్యుత్ దీపాలతో మండపాలను అలంకరించారు. రాష్ట్రంలోనే బోనాలకు ప్రసిద్ధి గాంచిన సికింద్రాబాద్ మహంకాళి ఆలయం ఈ నియోజకవర్గంలోనే ఉండటం మరో విశేషం నవ రాత్రుల వేళ ఈ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు అలంకరణ ఉంటాయి.
ప్రతిరోజూ భక్తులతో సందడిగా ఉంటుంది. ఆయా కాలనీల్లో వెలసిన అమ్మ వారి మండపాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారు. నేటి నుండి అమ్మవారు భక్తులకు రోజుకో రూపంలో దర్శనమిచ్చి భక్తుల్ని ఆనందింప జేస్తారు. కొన్ని మండపాల వద్ద ప్రత్యేక ప్రసాదాలు ఉంటాయి. కోరుకున్న కోరికలు నెరవేరడం కోసం కొందరు భక్తులు భవాని మాల వేసి ముడుపులు చెల్లించుకుంటారు.
తొమ్మిది రోజులు ఉపవాస దీక్షబూని దుర్గా మాత ని దర్శించుకుంటారు. ఓ పక్క బతుకమ్మలు యింకో పక్క దేవి నవరాత్రులు కాలనిలన్నీ పండగ శోభని సంతరించుకుంటాయి. పిల్లలకి దసరా సెలవుల దృష్ట్యా పిల్లల సందడి అంతా ఇంతా కాదు వాడ వాడలా కోలాహలంగా ఉంటుంది. విధుల్లో సాయంత్రం పూట అమ్మవారి మండపాలవద్ద యువతీ యువకులు కోలాటం దాండియా పేరిట ప్రత్యేక డ్యాన్సులతో ఆడి పాడి అందరిని అలరిస్తారు. కులాలకు మతాలకు అతీతంగా ఇక్కడి ప్రజలు అన్ని పండగల్ని అందరూ కలసి జరుపుకోవడం మరో ప్రత్యేకత.


