నాణ్యత లేకుండా అభివృద్ధి పనులు…
మేడారం పనులపై తీవ్ర విమర్శలు…
ప్రభుత్వానికి బీఆర్ఎస్ హెచ్చరిక….
బిఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు
కాకతీయ, ములుగు ప్రతినిధి : మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర ఏర్పాట్లలో జరుగుతున్న పనుల్లో నాసిరకం, అవ్యవస్థ, సంప్రదాయాల ఉల్లంఘన జరుగుతోందని ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు తీవ్ర విమర్శలు చేశారు. శనివారం ఏటూర్ నాగారం కేంద్రంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వారు రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై, అలాగే మంత్రి సీతక్కపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. జాతర ప్రాంతంలో వాడుతున్న మెటీరియల్ పూర్తిగా నాణ్యత లేనిదని, ఫ్లోరింగ్‌కు మట్టి కలిసిన ఇసుక వాడుతున్నారని ఆరోపించారు. అక్కడ గ్యాప్‌లు, లెవెల్ మిస్‌మ్యాచ్ స్పష్టంగా కనిపిస్తాయని, భక్తులకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందని చెప్పారు. ఈ విషయాన్ని ఇప్పటికే అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సరైన చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. క్యూ లైన్లు లేకపోవడం, చెత్త కుప్పలు పేరుకుపోవడం, ఎంట్రన్స్ ప్రాంతం గుర్తుపట్టలేనంతగా మారిపోవడం వల్ల భక్తులు అయోమయంలో పడుతున్నారని తెలిపారు. కోట్లాది మంది వచ్చే జాతరలో కనీస వసతులు కూడా సక్రమంగా లేవని విమర్శించారు. తొందరపడి పనులు చేయడం వల్ల క్వాలిటీపై దృష్టి పెట్టడం లేదని, దీని వల్ల శాశ్వత నష్టం జరుగుతుందని అన్నారు. జాతరలో తల్లులకు సమర్పించిన బెల్లం భక్తులకు అందకుండా మధ్యలో దళారుల చేతుల్లోకి వెళ్తోందని ఆరోపించారు. దీనిపై మంత్రి సీతక్క ప్రత్యేకంగా దృష్టి పెట్టి దళారుల వ్యవస్థను తొలగించాలని కోరారు.ఎన్నికల ముందు సమ్మక్క తల్లి మీద ప్రమాణం చేసి ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి నిలబెట్టుకోలేదని ఆరోపించారు. రైతులకు సాయం ఇప్పటికీ అందలేదని, వడగండ్ల వానకు పంట నష్టపోయిన ములుగు జిల్లా రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పారు. మేడారంలో క్యాబినెట్ మీటింగ్ పెట్టే ముందు రైతులకు చెక్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే 4000 పెన్షన్ హామీ కూడా అమలు కాలేదని, ప్రజల్లో దీనిపై తీవ్ర అసంతృప్తి ఉందని తెలిపారు. ఈసారి బడ్జెట్‌లో దీనికి నిధులు కేటాయించకపోతే ప్రభుత్వానికి ప్రజా ఆగ్రహం తప్పదని హెచ్చరించారు. మేడారం అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, ఆధునీకరణకు మద్దతు ఇస్తామని, కానీ ప్లానింగ్ లేకుండా, ఆలస్యంగా, నాసిరకంగా చేస్తున్న పనులను మాత్రం అంగీకరించబోమని స్పష్టం చేశారు. క్యాబినెట్ మీటింగ్ పేరుతో పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నారని, అసలు భక్తుల సౌకర్యాలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు


