నెలల గడుస్తున్నా కదలని అభివృద్ధి పనులు!
గుత్తేదారుల నిర్లక్ష్యంతో ఆగిన పనులు
కాగితాలకే పరిమితమైన టెండర్లు
వార్డుల్లో పెండింగ్‌లో కీలక ప్రాజెక్టులు
నోటీసులతో సరిపెడుతున్న అధికారులు
కాకతీయ, రామకృష్ణాపూర్ : క్యాతన్‌పల్లి పురపాలక పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు నెలలుగా ప్రారంభం కాకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. వార్డుల వారీగా కేటాయించిన పనులు కేవలం ఆన్‌లైన్, కాగితాలకే పరిమితమయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు టెండర్ ప్రక్రియ పూర్తి చేసినప్పటికీ, పనులు దక్కించుకున్న గుత్తేదారులు నెలల తరబడి కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీసీ డ్రైనేజీ, టాయిలెట్ బ్లాక్‌లు (టీబీజీ), అప్రోచ్ రోడ్లు, వాకింగ్ ట్రాక్‌లు, రహదారి ప్యాచ్ వర్క్‌లు, సేఫ్టీ స్టడ్స్ వంటి కీలక అభివృద్ధి పనులు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉండడం గమనార్హం. కొందరు కాంట్రాక్టర్లు పనులు చేపట్టడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు స్థానికంగా బహిరంగంగానే చర్చకు వస్తున్నాయి.
ఈ విషయమై సంబంధిత పెండింగ్ పనులపై మున్సిపల్ ఏఈ ఆశ్రిత్‌ను ‘కాకతీయ’ వివరణ కోరగా, గుత్తేదారులకు ఇప్పటికే మొదటి దఫా నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. అన్ని పనులు అత్యవసరమైనవని, త్వరలోనే పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మిషన్ భగీరథ పైప్‌లైన్ తవ్వకాల కారణంగా కొన్ని పనులకు ఆలస్యం జరుగుతోందని వివరించారు.


