ప్రభుత్వ పాఠశాల్లో అభివృద్ది పనులు పూర్తి చేయాలి
వర్షాకాలానికి ముందుగానే గ్రౌండ్ లెవెలింగ్ పూర్తి కావాలి
అధికారులకు కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశం
కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం
కాకతీయ, పెద్దపల్లి : ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాఠశాలల మౌలిక వసతుల అభివృద్ధిపై సంబంధిత అధికారులతో ఆయన చర్చించారు. వర్షాకాలానికి ముందుగానే గ్రౌండ్ లెవెలింగ్ పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో కంప్యూటర్‌ల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. రూ.40 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన డ్యూయల్ డెస్క్‌లను విద్యార్థుల సంఖ్య ఆధారంగా కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలలకు కేటాయించాలని ఆదేశించారు. కేజీబీవీల్లో కిచెన్ ఆధునికరణకు రూ.20 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు.
పనుల పురోగతి ఆధారంగానే బిల్లులు విడుదల చేయబడతాయని కలెక్టర్ స్పష్టం చేశారు. సింగరేణి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో సీపీఓ రవీందర్, డీసీహెచ్‌ఓ శ్రీధర్, సమగ్ర శిక్ష జిల్లా సమన్వయకర్త పీఎం షేక్, ప్లానింగ్ సెక్టోరియల్ ఆఫీసర్ మల్లేష్ తదితర అధికారులు పాల్గొన్నారు.


