శివనగర్‌లో అభివృద్ధి పనులు ప్రారంభం
రూ.కోటి నిధులతో రోడ్లు, డ్రైన్లు, కమ్యూనిటీ హాల్ అభివృద్ధి
మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా శంకుస్థాపన
కాకతీయ, ఖిలావరంగల్ : గ్రేటర్ వరంగల్ పరిధిలోని 35వ డివిజన్ శివనగర్ ప్రాంతంలో పలు అభివృద్ధి పనులకు అటవీ, పర్యావరణ, దేవాదాయ, పర్యాటక శాఖ మంత్రి కొండా సురేఖ గురువారం శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి పాల్గొన్నారు. డివిజన్లో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, మున్నూరు కాపు కమ్యూనిటీ హాల్ అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమం స్థానిక కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సుమారు రూ.50 లక్షలతో సీసీ రోడ్లు, మరో రూ.50 లక్షలతో కమ్యూనిటీ హాల్ అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. మొత్తం రూ.కోటి రూపాయల జనరల్ ఫండ్ నిధులతో ఈ పనులు ప్రారంభమైనట్లు వెల్లడించారు. తూర్పు నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను సమానంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. మున్నూరు కాపు కమ్యూనిటీ హాల్ మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందని, ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు ఉపాధి శిక్షణ కేంద్రంగా వినియోగించనున్నట్లు తెలిపారు. ప్రజాపాలన దిశగా వరంగల్ మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపాల నవీన్ రాజ్, టీపీసీసీ కార్యదర్శులు కొతపెల్లి శ్రీనివాస్, మీసాల ప్రకాష్, స్థానిక నేతలు, కాపు సంఘం ప్రతినిధులు, ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


