ప్రణవ్‌తోనే అభివృద్ధి
హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలకు చెరో 15 కోట్లు మంజూరు
బాణాసంచా కాల్చి సంబరాలు చేసిన కాంగ్రెస్ శ్రేణులు
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి ప్రణవ్ నాయకత్వంలోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ నేతలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలకు చెరో రూ.15 కోట్లు, మొత్తం రూ.30 కోట్ల నిధులు మంజూరైనట్లు పేర్కొన్నారు. ఈమేరకు గురువారం హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా, జమ్మికుంట గాంధీ చౌక్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు బాణాసంచా కాల్చి, పాలాభిషేకం నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ హయాంలో మున్సిపాలిటీలను నగరాలకు ధీటుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఉపఎన్నికల తరువాత కూడా హుజూరాబాద్ కు నిధులు మంజూరవ్వడం కాంగ్రెస్ విధానమేనని, కానీ గతంలో ఎమ్మెల్సీగా, ప్రభుత్వ విప్‌గా ఉన్న కౌశిక్ రెడ్డి ఏ నిధులు తీసుకురాలేదని విమర్శించారు. ఆయన నిజంగా అభివృద్ధి కోసం కృషి చేసి ఉంటే, ఎన్నికల సమయంలో కేసీఆర్ వాగ్దానం చేసిన రూ.1000 కోట్లు తీసుకురావాలని కోరారు. హుజూరాబాద్, జమ్మికుంట పట్టణ, మండల అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, బ్లాక్ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, మైనారిటీ విభాగం, బీసీ, ఎస్సీ సెల్, సేవాదళ్ వంటి అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.


