అభివృద్ధే లక్ష్యం కావాలి
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
కాకతీయ, కరీంనగర్ : పల్లెపల్లెల్లో కొనసాగుతున్న అభివృద్ధి యాత్రను మరింత వేగవంతం చేయాలంటే రానున్న పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఇల్లంతకుంట మండల పరిధిలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఎనిమిది మంది సర్పంచులు, పలువురు వార్డు సభ్యులు ఎల్ఎండీ కాలనీలోని ప్రజాభవన్‌లో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏకగ్రీవంగా ఎనిమిది పంచాయతీలు ఎన్నిక కావడం ప్రజల్లో ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, అభివృద్ధికి ప్రతిబింబిమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే ఈ ఏకగ్రీవాలకు కారణమని పేర్కొన్నారు. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రత్యేక ప్రాధాన్యంతో అదనపు నిధులు కేటాయిస్తామని భరోసా ఇచ్చారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి నిలిచిపోయిందని, కేవలం రెండేళ్లలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పల్లెబాట మారుస్తోందని ఎమ్మెల్యే చెప్పారు. సంక్షేమం,అభివృద్ధి రెండూ కలసి నడుస్తున్నాయని, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడం ద్వారా ఈ మార్గాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులు వీరే..
కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి (ముస్కానీపేట), బొల్లం మంజుల–రమేశ్ (తిప్పాపూర్), బద్దం శేఖర్ రెడ్డి (గాలిపెల్లి), పండుగ అనిత–తిరుపతి (జంగంరెడ్డిపల్లి), జక్కుల మల్లవ్వ (కిష్టారావుపల్లి), జుట్టు శేఖర్ (పత్తికుంటపల్లి), పోతరాజు చంటి (కేశన్నపల్లి)తో పాటు ఉప సర్పంచులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ మండల పరిషత్ అధ్యక్షులు గుడిసె అయిలయ్య యాదవ్, ఊట్కూరి వెంకటరమణారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎల్గందుల ప్రసాద్ తదితరులు.


