కాకతీయ, గీసుగొండ: కాకతీయ టెక్స్టైల్ పార్కులో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని టిజిఐఐసి విసి ఎండి శశాంక ఐఏఎస్ అన్నారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేట హవేలీ సమీపంలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును తెలంగాణా ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శశాంక ఐఏఎస్ పరిశీలించారు.
ఈ సందర్శనలో ఆయన పార్కు ప్రాంగణంలోని మౌలిక వసతులు, రోడ్లు, విద్యుత్, నీటి సదుపాయాలు, వరద నీటి ఎద్దడి నివారణకు నిర్మిస్తున్న నాల పనులను, ఆర్ఓ ప్లాంట్ పనులను, అలాగే పారిశ్రామిక యూనిట్లకు కేటాయించిన స్థలాలను పరిశీలించారు. పార్కు అభివృద్ధి వేగవంతం చేయాలని, ఇక్కడ స్థాపనకు ఆసక్తి చూపుతున్న టెక్స్టైల్ కంపెనీలకు అవసరమైన సదుపాయాలను సమయానికి అందించాలన్నారు.
శశాంక ఐఏఎస్ మాట్లాడుతూ.. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి ఒక మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. ఈ పార్క్ ద్వారా వేలు సంఖ్యలో ఉద్యోగా అవకాశాలు ఏర్పడతాయని, వరంగల్ పరిసర ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందని అన్నారు. అధికారులు, ఇంజినీరింగ్ విభాగం సిబ్బందికి సూచనలు ఇస్తూ, పనుల నాణ్యతలో ఎలాంటి రాజీపడ కూడదని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్య శారద, గీసుగొండ, సంగెం తహసిల్దార్లు ఎండి రియాజుద్దీన్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


