కాంగ్రెస్‌తోనే ఏదులాపురం అభివృద్ధి
కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధికి పూర్తి గ్యారెంటీ
మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దే సంకల్పం
మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి
కాకతీయ, కూసుమంచి : పాలేరు నియోజకవర్గ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముందుకు సాగుతున్నారని, రాబోయే రోజుల్లో ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ‘నంబర్ వన్’గా నిలబెట్టేందుకు ఆయన దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారని మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఖమ్మం నగరంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న మంత్రి క్యాంపు కార్యాలయంలో ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధికి చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం రూరల్ మండలానికి చెందిన 105 మంది లబ్ధిదారులకు రూ. 32.63 లక్షలు, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 73 మందికి రూ. 30.14 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. ఆపదలో ఉన్న పేదలకు సీఎంఆర్‌ఎఫ్ ఒక వరంలా మారిందని దయాకర్ రెడ్డి పేర్కొన్నారు.
అభివృద్ధి బాధ్యత మంత్రిదే
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఏదులాపురంలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తే, ఆ ప్రాంతాన్ని రాష్ట్రం గర్వించేలా అభివృద్ధి చేసే పూర్తి బాధ్యతను మంత్రి పొంగులేటి స్వయంగా తీసుకుంటారని ఆయన హామీ ఇచ్చారు. అభివృద్ధిలో పాలేరు నియోజకవర్గం రాష్ట్రానికే దిక్సూచి కావాలన్నదే లక్ష్యమని తెలిపారు. మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త అర్థం ఇస్తోందని దయాకర్ రెడ్డి అన్నారు. ఉచిత బస్సు ప్రయాణంతోనే కాకుండా ‘స్త్రీ శక్తి’ పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల నిర్వహణ బాధ్యతలను మహిళలకు అప్పగించిందని గుర్తుచేశారు. మహిళలను కేవలం ఓటర్లుగా కాకుండా పాలనలో భాగస్వాములుగా చేయాలన్న ఉద్దేశంతోనే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో చైర్మన్ సీట్లలో మెజారిటీ స్థానాలను మహిళలకు కేటాయించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


