- ప్రజా ప్రభుత్వ లక్ష్యం నాణ్యమైన విద్య
- గుత్తికోయ గూడెంలో పాఠశాల భవనాల ప్రారంభం
- ములుగు జిల్లాలో పర్యటించిన మంత్రి సీతక్క
కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా అభివృద్ధి పథంలో మరో ముందడుగు పడింది. రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శనివారం ఏటూరు నాగారం ఎస్.ఎస్. తాడ్వాయి మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఏటూరు నాగారం మండల కేంద్రంలో కోటి రూపాయల నిధులతో నిర్మించనున్న వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులకు, అలాగే ఏడున్నర కోట్ల రూపాయల బస్ డిపో నిర్మాణానికి మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రతి గ్రామానికి మాస్టర్ ప్లాన్ ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది అన్నారు.
ఏటూరు నాగారం రెవెన్యూ డివిజన్‌గా, ఐదు మండలాల కేంద్రంగా ఉన్నందున దీనిని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేశాం అన్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజల అవసరాల దృష్ట్యా కూరగాయల మార్కెట్ నిర్మాణం చేపట్టాం అని తెలిపారు. బస్సు డిపో ఏర్పాటుతో ప్రాంతీయ రవాణా వ్యవస్థకు ఊపిరి వస్తుందన్నారు. ఏటూరు నాగారం నుంచి గోదావరి వరకు రెండున్నర కోట్లతో సీసీ రోడ్డు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. రాబోయే రోజుల్లో మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేసి అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం అని ఆమె అన్నారు. జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మాట్లాడుతూ ఏటూరు నాగారంలో ప్రతిష్టాత్మకంగా వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం ప్రారంభమైందన్నారు. రాబోయే రోజుల్లో గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్ వంటి అభివృద్ధి పనులను కూడా చేపడతామని స్పష్టం చేశారు. అనంతరం ఎస్.ఎస్. తాడ్వాయి మండలంలోని కొండపర్తి క్రాస్, చేన్నాపురం తోగు, లవ్వల స్టేజీ, జలగలంచ ప్రాంతాల్లో మూడు లక్షల నిధులతో నిర్మించిన ప్రాథమిక పాఠశాల భవనాలను మంత్రి సీతక్క ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాణ్యమైన విద్య అందించడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం అని, గుత్తికోయ పిల్లలకు చదువు అందించాలనే ఉద్దేశంతో అడవి ప్రాంతాల్లో పాఠశాలలను ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే అన్ని గుత్తికోయ హాబిటేషన్లలో సోలార్ లైట్స్ ఏర్పాటు చేస్తాం అని తెలిపారు. జలగలంచ ప్రాంతం రహదారికి దగ్గరగా ఉండటం వల్ల పిల్లల భద్రత కోసం తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు. అనంతరం గుత్తికోయ చిన్నారులతో మంత్రి ముచ్చటించడం చిన్నారుల్లో ఆనందాన్ని కలిగించింది. ఈ కార్యక్రమాలలో జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


