అధికార పార్టితోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
కాకతీయ, ఆత్మకూరు : అధికార పార్టితోనే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆత్మకూరు మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం సరఫరా, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రుణమాఫీ, సన్నబియ్యానికి రూ.500 బోనస్ వంటి పథకాలు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. గ్రామాల అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు సూచించారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు గల్లీబొల్లి మాటలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, వారికి ఓట్ల రూపంలో తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామాల అభివృద్ధినే లక్ష్యంగా పని చేస్తున్నారని పేర్కొన్నారు.
కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కమలపురం రమేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బీరం ఆనంద్ సుధాకర్ రెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ ఏరుకొండ రవీందర్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ పరికిరాల వాసు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు రేవూరి రణధీర్ రెడ్డి, అలువాల రవి, ఎన్నికల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.


