మంత్రి కొండా సురేఖ చొరవతో తండాల అభివృద్ధి
రూ.722.09 లక్షల పనులకు సానుకూల నిర్ణయం
గిరిజన సంక్షేమానికి కీలక ముందడుగు
జిల్లా కాంగ్రెస్ నాయకులు రడం భరత్ కుమార్
కాకతీయ, గీసుగొండ : గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో కీలక ముందడుగు పడింది. గీసుగొండ మండలంలోని తండా గ్రామపంచాయతీల్లో మౌలిక వసతుల లోటును అధిగమించేందుకు జిల్లా కాంగ్రెస్ నాయకులు రడం భరత్ కుమార్ రూపొందించిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి కొండా సురేఖ సానుకూలంగా స్పందించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థల అభివృద్ధి, మహిళా సమాఖ్య భవనాల నిర్మాణం వంటి అంశాలతో దాదాపు 55 అభివృద్ధి పనులకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, గిరిజన సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ ట్రైబల్ ఫండ్స్ లేదా ఇతర ప్రభుత్వ నిధుల ద్వారా పనులు అమలు చేయాలని సంబంధిత ట్రైబల్ శాఖకు మంత్రి అధికారిక లేఖ జారీ చేశారు. ఈ ప్రతిపాదిత అభివృద్ధి పనుల మొత్తం అంచనా వ్యయం సుమారు రూ.722.09 లక్షలు కావడం గమనార్హం. ఈ నిర్ణయం తండా గ్రామపంచాయతీల అభివృద్ధికి కొత్త దిశను చూపే కీలక మైలురాయిగా నిలుస్తోంది. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న మౌలిక వసతులు కార్యరూపం దాల్చే దిశగా ప్రభుత్వ యంత్రాంగం వేగంగా కదులుతుండటంతో గిరిజన సమాజంలో ప్రభుత్వంపై విశ్వాసం మరింత బలపడుతోంది. ప్రజల అవసరాలను ప్రభుత్వ అజెండాగా మార్చడంలో రడం భరత్ చూపిన చొరవకు స్పందించి నిర్ణయం తీసుకున్న మంత్రి కొండా సురేఖ నాయకత్వంపై తండా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


