కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం
ప్రజా ప్రభుత్వంతో ప్రజా పాలన
మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
చెన్నూరులో అభివృద్ధి పనుల ప్రారంభం
సర్పంచ్‌లకు ఘన సన్మానం
రానున్న ఎన్నికలపై కార్యకర్తలకు దిశానిర్దేశం
కాకతీయ, రామకృష్ణాపూర్ (చెన్నూరు) : కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని, ప్రజా ప్రభుత్వంలో ప్రజలందరికీ ప్రజా పాలన అందుతుందని చెన్నూరు ఎమ్మెల్యే, కార్మిక,ఉపాధి, గనుల కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. శుక్రవారం చెన్నూరు నియోజకవర్గంలో ఆయన పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చెన్నూరులో నూతనంగా నిర్మించిన అంబేద్కర్ భవన్, కూరగాయల మార్కెట్ భవనాలను మంత్రి వివేక్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం చెన్నూరు క్యాంప్ కార్యాలయంలో ఇటీవల జరిగిన మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన గ్రామ సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన మంత్రి వివేక్… గ్రామ స్థాయిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇదే జోష్‌తో పనిచేసి కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం మరింత శ్రమించాలని పిలుపునిచ్చారు.
ప్రతిపక్షాలు ప్రజా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసినప్పటికీ, ప్రజలు ప్రజా పాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికే మెజారిటీ స్థానాలు కట్టబెట్టారని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని హామీ ఇస్తూ, వారి వెంటే పార్టీ నిలుస్తుందని భరోసా కల్పించారు.


