అధికార కాంగ్రెస్‌ను గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యం
పరకాల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి
ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
కాకతీయ, పరకాల : అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే పరకాల మున్సిపాలిటీకి సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం పరకాల పట్టణంలోని పలు వార్డుల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అధికార పార్టీకి ప్రజలు అండగా నిలవాలని, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే పట్టణ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. పట్టణ కేంద్రంలో ప్రత్యేక డీపీఆర్ విధానంతో డ్రైనేజ్, రోడ్లు, విద్యుత్, తాగునీటి సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తున్నామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలకులు ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, అభివృద్ధి పేరుతో ప్రజాధనాన్ని దోచుకున్నారని తీవ్రంగా విమర్శించారు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా స్వార్థ రాజకీయాలు చేశారని ఆరోపించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 22 వార్డులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని పరకాల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 5వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పంచగిరి మాధవి శ్యాంప్రసాద్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర పరిశీలకులు, మాజీ ఎంపీ పి. విశ్వనాథ్, టీపీసీసీ ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య, మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


