కేంద్రం నిధులతోనే వరంగల్‌లో అభివృద్ధి
కేఎంసీలో హాస్పిటల్, ట్రైబల్ వర్సిటీ, కోచ్ ఫ్యాక్టరీ కేంద్రం సహకారంతోనే
డబుల్ ఇంజిన్ సర్కారు వస్తేనే రాష్ట్రంలో అద్భుత ప్రగతి
అన్నింటా రేవంత్ సర్కారు విఫలం.. భూముల అమ్మకమే ప్రభుత్వ లక్ష్యం
వరంగల్‌లో బీజేపీ చీఫ్ రాంచందర్ రావు ఫైర్
వరంగల్ భద్రకాళి అమ్మవారి దర్శనం ఆధ్యాత్మిక శక్తినిచ్చిందంటూ వ్యాఖ్య
కాకతీయ, వరంగల్ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుండగా, వరంగల్ అభివృద్ధి మాత్రం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ముందుకు సాగుతోందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వరంగల్‌కు వచ్చిన తొలి అధికారిక పర్యటనలో భాగంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. భద్రకాళి అమ్మవారి దర్శనం తనకు ఆధ్యాత్మిక శక్తినిచ్చిందని, ఆ ఆశీస్సులు పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. గతంలో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సందర్శన సందర్భంగా కేంద్ర మంత్రులతో కలిసి వచ్చిన అనుభవాన్ని గుర్తుచేశారు.
కేంద్ర నిధులతోనే వరంగల్ అభివృద్ధి
వరంగల్ నుంచి బీజేపీ ఎంపీలు లేకపోయినా కేంద్ర ప్రభుత్వం రూ.2 వేల కోట్లకుపైగా నిధులతో అభివృద్ధి పనులు చేపట్టిందని తెలిపారు. కేఎంసీలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ములుగు సమ్మక్క–సారక్క ట్రైబల్ యూనివర్సిటీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే సాధ్యమయ్యాయని స్పష్టం చేశారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వరంగల్‌కు చెప్పుకోదగిన అభివృద్ధి లేదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేంద్రం చేసిన పనులను తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. వరంగల్ మాస్టర్ ప్లాన్ పేరిట రూ.4 వేల కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పటివరకు ఒక్క పనీ ప్రారంభించలేదన్నారు.
భూముల అమ్మకాలే ప్రభుత్వ లక్ష్యం..లక్షణం
రేవంత్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి కంటే భూముల అమ్మకాలపైనే దృష్టి పెట్టిందని ఆరోపించారు. కాకతీయ యూనివర్సిటీలో అధ్యాపకుల కొరత ఉన్నా పట్టించుకోకపోవడం, విశ్వవిద్యాలయ భూములపై ప్రభుత్వం కన్నేయడం దుర్మార్గమని అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, మౌలానా ఉర్దూ యూనివర్సిటీ భూములపై జరుగుతున్న కుట్రలను ప్రస్తావించారు. ఉస్మానియా యూనివర్సిటీకి వెయ్యి కోట్ల నిధులు ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం కాంగ్రెస్ పాలనకు నిదర్శనమని విమర్శించారు. అసెంబ్లీలో ప్రజల సమస్యలపై చర్చే జరగడం లేదని రాంచందర్ రావు ఆరోపించారు. రైతు బంధు నిలిపివేత, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలు వంటి అంశాలపై ప్రభుత్వం మౌనం వహిస్తోందన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇస్తే అమృత్, స్మార్ట్ సిటీ, హృదయ్ వంటి కేంద్ర పథకాలతో అభివృద్ధి ఎలా జరుగుతుందో చూపిస్తామని ప్రజలను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ పూర్తి చేసి హ్యాండ్ఓవర్ చేస్తే మామునూరు ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి కేంద్రం పూర్తిగా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి ఆదరణ
ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించిందని తెలిపారు. గతంలో 163 సర్పంచులు ఉండగా, ఇప్పుడు 900కి పైగా సర్పంచులు ఉండటం గ్రామీణ ప్రాంతాల్లో పార్టీపై పెరిగిన విశ్వాసానికి నిదర్శనమన్నారు. బీజేపీలో వర్గాలు లేవని, మోదీ నాయకత్వమే ఒక్కటే వర్గం అని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కార్ తప్పనిసరిఅని, ప్రజల పక్షాన నిలబడి ప్రతి సమస్యపై పోరాడతామని తేల్చిచెప్పారు. సమావేశంలో హనుమకొండ జిల్లా అధ్యక్షుడు సంతోష్ రెడ్డి, రావు పద్మ రెడ్డి, డా. పగడాల కాళీ ప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గౌతంరావు, తుళ్ళ వీరేందర్ గౌడ్, యువ మోర్చా అధ్యక్షుడు గుండె గణేష్, అధికార ప్రతినిధి ఎన్.వి. సుభాష్, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ సీతారామ్ నాయక్, రాష్ట్ర నాయకుడు పేరం గోపికృష్ణ, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.


