రాష్ట్రంలో రాక్షస పాలన
మహిళలను కించపరిచిన వారు భూస్థాపితం
రేవంత్ మాటలే ఆయన స్థాయిని బయటపెడుతున్నాయి
చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మండిపడ్డారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచుల సన్మాన సభ వేదికగా కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో తెలంగాణ సాధించి, పదేళ్లపాటు దేశానికే ఆదర్శంగా పాలన అందించిన కేసీఆర్‌ను ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే బీఆర్ఎస్ శ్రేణులు, తెలంగాణ ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి తన మాటలతోనే ప్రజల్లో తన స్థాయిని తగ్గించుకుంటున్నారని విమర్శించారు. నువ్వు సీఎం వా? చిల్లరగానివా? అన్న స్థాయిలో ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి తెచ్చుకున్నది రేవంత్ రెడ్డే అన్నారు. పాలమూరు ప్రాజెక్టు డీపీఆర్ తిరిగి వచ్చిన తర్వాత రెండేళ్లలో ప్రభుత్వం ఏం చేసిందో చెప్పే దమ్ముందా? అని ప్రశ్నించారు. పది శాతం పనులు కూడా పూర్తి చేయలేని చేతగాని ప్రభుత్వమిదని కాంగ్రెస్ పాలనను తీవ్రంగా విమర్శించారు.
మహిళలపై వ్యాఖ్యలతో అసలు స్వరూపం
తెలంగాణలో రాక్షస పాలన కొనసాగుతోందని ఆరోపించిన సుంకే, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలతో మహిళల పట్ల రేవంత్ రెడ్డికి ఉన్న గౌరవం ఏంటో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. మహిళలను కించపరిచిన వారు చరిత్రలో భూస్థాపితం అయ్యారని దుర్యోధనుడు, రావణాసురుల ఉదాహరణలు ఇచ్చారు. 2029లో రేవంత్ రెడ్డిని ప్రజలే భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు.
హామీల అమలులో వైఫల్యం
నవంబర్‌లో వేయాల్సిన రైతుబంధు, డిసెంబర్‌లో వేయాల్సిన రైతుబంధు ఇప్పటికీ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. కల్యాణలక్ష్మి కింద తులం బంగారం, పెన్షన్‌ను రూ.4 వేలుగా చేస్తామన్న హామీలు నెరవేర్చలేదని, 420 హామీలతో ప్రజలను మోసం చేసిన ప్రభుత్వమిదని మండిపడ్డారు. సీఎం మాటలపై నియంత్రణ కోసం ఐఏఎస్ అధికారులే రేవంత్ రెడ్డికి మంచి భాష నేర్పించాలని, అవసరమైతే ఎర్రగడ్డ ఆసుపత్రిలో చూపించాలని కాంగ్రెస్ నేతలే కోరే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. మేము తిట్టడం మొదలుపెడితే హుస్సేన్ సాగర్‌లో బండగట్టుకుని దూకాల్సి వస్తుందని చేసిన వ్యాఖ్యలు సమావేశంలో సంచలనం సృష్టించాయి. సమావేశంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్వి నాయకులు చుక్క శ్రీనివాస్, బొంకురి మోహన్, మాచర్ల వినయ్, నవీన్ రావు, మామిడి తిరుపతి, పూడూరి మల్లేశం, తౌటు మురళి, వెంకట రమణారెడ్డి, ఆకుల మధుసూదన్, రాజేందర్ రెడ్డి, విజయేందర్ రెడ్డి, చుక్కారెడ్డి, గడ్డం స్వామి, కొత్త గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


