కాకతీయ, నేషనల్ డెస్క్: ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి జరిగింది. సివిల్ లైన్స్ లోని అధికారిక నివాసంలో బహిరంగ సభ నిర్వహిస్తున్న సమయంలో ఈ దాడి చోటుచేసుకున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. 35ఏళ్ల వయస్సున్న ఓ వ్యక్తి ఈ దాడికి పాల్పడినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మొదట అతను కొన్ని పేపర్లను ముఖ్యమంత్రికి అందించిన తర్వాత ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనను బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవ్ తీవ్రంగా ఖండించారు. పోలీసులకు సమాచారం అందించడంతో దర్యాప్తు చేపట్టారు.
అసలేం జరిగింది?
ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్త తన అధికారిక నివాసంలో ప్రతి వారం జన్ సున్ వాయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ యువకుడు కొన్ని పేపర్లను సీఎంకు అందించాడు. అంతలోనే బిగ్గరగా అరుస్తూ ముఖ్యమంత్రిపై దాడికి పాల్పడ్డాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన వ్యక్తిగత భద్రతా సిబ్బందిని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతడిని రాజ్ కోట్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఊహించని పరిణామంతో సీఎం ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆమెను వెంటనే వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.
సీఎంపైదాడికి రాజకీయ పక్షాలు తీవ్రంగా ఖండించాయి. ఢిల్లీ మంత్రి మంజీందర్ సింగ్ సిస్రా ఈ ఘటనపై మాట్లాడుతూ..ఢిల్లీ ప్రజల కోసం తీవ్రంగా శ్రమిస్తున్న సీఎంపై దాడి చేయడం దారుణమన్నారు. ఇది ప్రత్యర్థుల కుట్ర అని అనుమానం వ్యక్తం చేశారు. దీనిలో ఏదైనా రాజకీయ కుట్రా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఘటనను ప్రతిపక్షనేత ఆతిశీ కూడా ఖండించారు. ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదున్నారు.


