ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్.. మోదీ స్ట్రాంగ్ వార్నింగ్!
కాకతీయ, జాతీయం : దేశ రాజధాని ఢిల్లీ సోమవారం సాయంత్రం భయానక దృశ్యాలకు వేదికైంది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో పార్క్ చేసి ఉన్న ఓ కారులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పోగా, మరో 24 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనతో దేశం మొత్తం ఉలిక్కిపడింది. ఈ దారుణ ఘటనపై జాతీయ భద్రతా ఏజెన్సీ (NIA), ఢిల్లీ పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం భూటాన్ పర్యటనలో ఉన్న ఆయన, థింఫులో జరిగిన కార్యక్రమంలో ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్‌పై తొలిసారి రియాక్ట్ అయ్యారు. ఎర్రకోట వల్ల బాంబు దాడికి పాల్పడిన నిందితులను ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టమని దేశ ప్రజలకు హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
మోదీ మాట్లాడుతూ.. “ఈ రోజు నేను చాలా బరువెక్కిన హృదయంతో ఇక్కడికి వచ్చా. ఢిల్లీలో జరిగిన ఈ భయానక ఘటన ప్రతి భారతీయుడి మనసును కలచివేసింది. బాధిత కుటుంబాల బాధను నేను పూర్తిగా అర్థం చేసుకుంటున్నాను. దేశం మొత్తం ఈ కష్ట సమయంలో వారికి అండగా ఉంటుంది. దాడికి పాల్పడిన వారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టం. అమాయకుల ప్రాణాలు తీసిన వారందరికీ తగిన శిక్ష తప్పదు. ” అని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ ప్రధాని మోదీ హృదయపూర్వక సానుభూతి వ్యక్తం చేశారు. “వారి దుఃఖాన్ని దేశం పంచుకుంటుంది. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా సాయం అందించబడుతుంది” అని భరోసా కల్పించారు. కాగా, సోమవారం రాత్రంతా మోదీ దర్యాప్తు సంస్థలతో నిరంతరంగా సంప్రదింపులో ఉన్నారని ప్రధాన కార్యాలయం వర్గాలు తెలిపాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దర్యాప్తును దగ్గరుండి పర్యవేక్షిస్తోంది. నిందితుల కదలికలు, పేలుడుకు గల ఉద్దేశ్యం వంటి అంశాలపై ప్రత్యేక బృందాలు విశ్లేషణ కొనసాగిస్తున్నాయి.


