కాకతీయ, నేషనల్ డెస్క్: ఢిల్లీలోని ఓ విలాసవంతమైన వసంత్ కుంజ్ ప్రాంతంలో ఉన్న ఓ ఆశ్రమంలోని స్వామీజీపై లైంగిక వేధింపులకు సంబంధించి ఆరోపణలు వచ్చాయి. దాదాపు 17 మంది అమ్మాయిలు ఆ స్వామీజీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీ శారద ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్ మెంట్ లో పనిచేస్తున్న స్వామి చైతన్యానంద సరస్వతి అలియాస్ పార్థసారథి అనే స్వామీజీపై కేసు నమోదు చేశారు. బలహీన వర్గాల కేటగిరిలో పీజీ మేనేజ్ మెంట్ డిప్లామా కోర్సులు చదువుతున్న విద్యార్థినులు స్వామీజీపై ఈ ఫిర్యాదు చేశారు.
విద్యార్థినులు ఇచ్చిన ఫిర్యాదుల ప్రకారం, స్వామీ చైతన్యానంద తరచుగా ద్వేషపూరితంగా మాట్లాడేవారని, అశ్లీలమైన మెసేజ్‌లు పంపేవారని తెలిపారు. అంతేకాదు, భౌతికంగా దగ్గరకు వచ్చేందుకు ప్రయత్నించాడని పేర్కొన్నారు. ఆశ్రమంలోని కొంతమంది సిబ్బంది, ముఖ్యంగా మహిళా వార్డెన్లు, డైరెక్టర్ ఆదేశాల ప్రకారం విద్యార్థినులపై ఒత్తిడి తెచ్చేవారని ఆరోపించారు.
ఈ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు స్వామీ చైతన్యా నందపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. డీసీపీ అమిత్ గోయల్ సమాచారం ప్రకారం, ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉండగా, ఆయన ఆగ్రా పరిసర ప్రాంతాల్లో ఉన్నాడని సమాచారం రావడంతో అక్కడ గాలింపు ప్రారంభమైంది.
దర్యాప్తులో భాగంగా, ఆశ్రమ బేస్‌మెంట్‌లో ఉన్న ఒక వోల్వో కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఆ వాహనాన్ని స్వామీజీ ఉపయోగించినట్లు తేలింది. ఆ కారుపై ఫేక్ డిప్లమాటిక్ నంబర్ ప్లేట్ (39 UN 1) అమర్చినట్లు బయటపడింది. దీంతో వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు.
ఈ ఘటనల నేపథ్యంలో ఆశ్రమంపై వెంటనే చర్యలు తీసుకుంది. స్వామీ చైతన్యానందను అన్ని పదవుల నుంచి తొలగించామని ప్రకటించింది. శృంగేరి దక్షిణామ్నాయ శారదా పీఠం కూడా స్పందించింది. ఆయన ప్రవర్తన అక్రమమని, పీఠం ఆచారాలకు విరుద్ధమని పేర్కొంటూ, అన్ని సంబంధాలను తెంచుకున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఢిల్లీ పీఠం యూనిట్‌లో రెండు బ్యాచ్‌లు ఉంటాయని, ఒక్కో బ్యాచ్‌లో 35 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని అధికారులు తెలిపారు.


