విచారణ పేరుతో కాలయాపనా?
డ్యూటీలోనే మద్యం సేవించిన అధికారులపై చర్యలేవీ?!
ప్రభుత్వ వాహనంలో ప్రైవేటు పార్టీకి మద్యం తరలింపు
సాక్ష్యాధారాలతో కథనం ప్రచురించిన కాకతీయ
నెలరోజులైనా ‘విచారణ’ పేరుతో జాప్యం
సామాన్యులపైనే ప్రతాపమా..?
సొంత శాఖ అధికారుల తప్పిదాలకు శిక్షలుండవా..?
బహిరంగ ఉల్లంఘణలపైనా చూసి చూడనట్లే..!
మాముళ్ల మత్తే అధికారుల వైఖరి కారణమంటూ ఆరోపణలు
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ ఎక్సైజ్ శాఖ అధికారుల పనితీరు తీవ్ర విమర్శలకు గురవుతోంది. ప్రభుత్వ ఎక్సైజ్ వాహనంలోనే మద్యం తరలింపు, డ్యూటీలో ఉన్నప్పుడే మద్యం సేవించినట్లు వచ్చిన ఆరోపణలు వంటి అత్యంత తీవ్రమైన అంశాలు వెలుగులోకి వచ్చినా, ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారాలపై సాక్ష్యాధారాలతో సహా కాకతీయ దినపత్రిక కథనాలు ప్రచురించినప్పటికీ, అధికారుల నుంచి వినిపిస్తున్న సమాధానం ఒక్కటే— “విచారణ జరుగుతోంది”. అయితే ఆ విచారణ ఎప్పుడు పూర్తవుతుంది? తప్పు చేసిన వారిపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారు? అన్న ప్రశ్నలకు మాత్రం నెలలు గడుస్తున్నా సమాధానాలు లేవు. అక్టోబర్, డిసెంబర్ నెలల్లో వరుసగా కథనాలు వెలువడినా శాఖలో ఎలాంటి కదలిక కనిపించకపోవడం గమనార్హం. విచారణ బాధ్యతలు అప్పగించామన్న ప్రకటనలే తప్ప, నివేదికలు, నిర్ణయాలు, శిక్షలు ప్రజల ముందుకు రాకపోవడం ఎక్సైజ్ శాఖ పనితీరుపై అనుమానాలను మరింత బలపరుస్తోంది. నిజంగానే విచారణలు జరుగుతున్నాయా? లేక కాలం గడిపే ప్రక్రియగానే మిగిలిపోయాయా? అన్న సందేహాలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి.

బహిరంగంగా ఉల్లంఘించినా..!
కరీంనగర్ నగరంలోని పలు వైన్స్, పర్మిట్ రూంలలో నిబంధనలకు విరుద్ధంగా డబుల్ సిట్టింగులు, అనధికార షెడ్లు, పరిశుభ్రత నిబంధనల ఉల్లంఘనలు బహిరంగంగానే కొనసాగుతున్నాయి. జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లోనే ఈ అక్రమాలు సాగుతున్నా, క్షేత్రస్థాయిలో తనిఖీలు లేకపోవడం అధికారుల మౌనానికి నిదర్శనంగా మారింది. ప్రతి వివాదాస్పద ఘటనపై అధికారులు ఇచ్చే సమాధానం ఒకే తీరుగా ఉండటం గమనార్హం— “సంబంధిత అధికారికి తెలియజేశాం… విచారణలో ఉంది”. అయితే ఈ మాటల తర్వాత ఒక్క చర్య కూడా కనిపించకపోవడంతో, ఇవి కేవలం మాటలకే పరిమితమైన ప్రకటనలుగా మిగులుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చర్యలు ఉండవన్న భావన బలపడటంతో వైన్స్ నిర్వాహకులు నిబంధనలను పక్కనపెట్టి ఇష్టారాజ్యంగా వ్యాపారం సాగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
బలపడుతున్న అనుమానాలు
నెలలు గడుస్తున్నా ఎక్సైజ్ శాఖ నుంచి స్పష్టమైన చర్యలు లేకపోవడం వెనుక నెలవారీ ముడుపుల వ్యవస్థే కారణమన్న అనుమానాలు కరీంనగర్ ప్రజల్లో బలంగా వ్యక్తమవుతున్నాయి. ఈ అంశాలపై వివరణ కోరగా కరీంనగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ స్పందించారు. ప్రభుత్వ ఎక్సైజ్ వాహనంలో మద్యం తరలించిన ఘటనపై అసిస్టెంట్ సూపరింటెండెంట్‌కు విచారణ బాధ్యతలు అప్పగించామని, సోమవారం పూర్తి వివరాలు తెలుస్తాయని తెలిపారు. అలాగే వెంకటేశ్వర వైన్స్‌లో కొనసాగుతున్న నిబంధనల ఉల్లంఘనలు, డబుల్ పర్మిట్ రూం నిర్వహణపై వివరణ కోరగా, ఈ విషయాన్ని సంబంధిత ఎక్సైజ్ సీఐకి తెలియజేశామని చెప్పారు. అయితే ఈ ఘటనలు వెలుగులోకి వచ్చి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఒక్క స్పష్టమైన చర్య కూడా కనిపించకపోవడం పట్ల ప్రజల్లో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, విచారణలను వేగవంతం చేసి, తప్పు చేసిన వారు ఎవరో తేల్చి కఠిన చర్యలు తీసుకోవాలని కరీంనగర్ నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.


