స్మార్ట్ సిటీ పనుల్లో జాప్యం
అధ్వాన్నంగా డివైడర్
కాకతీయ, గీసుగొండ :
స్మార్ట్ సిటీ నిధులతో వరంగల్ మహానగర పాలక సంస్థ 16వ డివిజన్ పరిధిలో కోటగండీ వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ పనులు పూర్తి కాకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. డివైడర్ నిర్మించినప్పటికీ మట్టి పోసి పూలమొక్కలు నాటి సుందరీకరణ చేయాల్సి ఉండగా, మధ్యలోనే వదిలేయడంతో ఇప్పుడు అవి పిచ్చి మొక్కలతో నిండిపోయి అధ్వాన్నంగా దర్శనమిస్తున్నాయి. అంతేకాక, నర్సంపేట రోడ్డులో నిర్మిస్తున్న స్వాగత తోరణం పనులు కూడా నత్తనడకన కొనసాగుతున్నాయి. స్వాగతతోరణ పనులు జరుగుతున్నప్పుడు రోడ్డు వన్ వే చేయడంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహానగరపాలక సంస్థ ప్రవేశంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే కార్పొరేషన్ వీధులలో ఎలాంటి పరిస్థితి ఉందోనని వాహనదారులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


