*ఉప ఎన్నికలు తప్పవా..?!
*ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పదవీ గండమే.!!
*బీఆర్ ఎస్‌లో ఉన్నట్లుగా టెక్నికల్ నిరూపణ కూడా కష్టమే
*పార్టీకి దూరంగా.. మెడలో గులాబీ కండువా కప్పుకోకపోవడంపై ఫిర్యాదు
*కాంగ్రెస్ కండువాలు కప్పుకోవడంపై అభ్యంతరాలు
*మంత్రులు, టీపీసీసీ చీఫ్ టీవీ చానెల్ ఇంటర్వ్యూను సాక్ష్యంగా చూపే అవకాశం
*స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే.. కోర్టుకు నివేదించే అవకాశం
*నిర్ధిష్టమైన ఆధారాలు స్పీకర్‌కు, కోర్టుకు అందజేసేందుకు బీఆర్ఎస్ కసరత్తు
*అందుకే ఎన్నికలను ఎదుర్కొంనేందుకే కడియం, దానం నిర్ణయం
*నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేల్లో పెరిగిన ఆందోళన
*ఏం చేద్దామన్న యోచనలో కాంగ్రెస్ అధిష్ఠానం
*ఉప ఎన్నికలు రావడం ఖాయమంటూ కేటీఆర్ ఉద్ఘాటన
*పది నియోజకవర్గాల్లో కేటీఆర్ పర్యటనలకు షెడ్యూల్..!
*తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మెగా టర్న్‌కు అవకాశం
కాకతీయ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర రాజకీయాలు మెగా టర్న్ తీసుకునే అవకాశం కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయమేనన్న అభిప్రాయం ఇటు న్యాయ వర్గాలు, అటు రాజకీయ వర్గాల నుంచి బలంగా వినిపిస్తున్నాయి.ఎమ్మెల్యేల వివరణలపై బీఆర్ఎస్ పార్టీ నుంచి స్పీకర్ అభ్యంతరాలను స్వీకరించేందుకు లేఖలు రాశారు. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పార్టీలోనే కొనసాగుతున్నట్లుగా చెప్పిన వివరణలకు కౌంటర్‌గా.. వారు పార్టీలో కొనసాగడం లేదని, కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నారని, పార్టీలో చేరినట్లుగా నిర్ధిష్టమైన ఆధారాలు చూపాల్సి ఉంటుంది. ఈనేపథ్యంలో ఇప్పటికే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి సాక్ష్యాధారాలు, వారి కామెంట్స్‌ను సాక్ష్యాలుగా చూపే అవకాశం ఉంది.
అలాగే పార్టీ ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామా చేయలేదనే వాదనను వినిపిస్తున్న ఎమ్మెల్యేల వివరణ కూడా సహేతుకత లేదన్న విషయాన్ని స్పీకర్‌కు, కోర్టుకు గులాబీ పార్టీ నివేదించేందుకు సిద్ధమవుతోంది. స్పీకర్ నోటీసుల జారీ తర్వాత సదరు ఎమ్మెల్యేల్లో గుబులు పట్టుకుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు టెక్నికల్ అంశాలతో ఈ గండం నుంచి బయట పడాలని చూస్తున్నా.. అదంతా ఈజీకాదన్న అభిప్రాయం న్యాయ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.
బీఆర్ఎస్ లేవనెత్తనున్న ప్రశ్నలు..! ఇరకాటంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు
బీఆర్ఎస్ పార్టీ బీ ఫాంపై గెలిచిన బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అరెకపూడి గాంధీ, సంజయ్, గూడెం మహిపాల్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, కాలె యాదయ్య, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లు పార్టీకి వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ పంచన చేరారని బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణలపై అభ్యంతరాలుంటే తెలపాలని స్పీకర్ కార్యాలయం అధికారులు శుక్రవారం తెలంగాణ భవన్‌కు లేఖలు పంపారు. అనేక అభ్యంతరాలను లేవనెత్తేందుకు బీఆర్ ఎస్ పార్టీ సన్నద్ధమైంది. న్యాయ నిపుణుల సలహాలతో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలుండేలా పక్కా ఆధారాలను స్పీకర్‌కు, కోర్టుకు నివేదించేందుకు సిద్ధమవుతోంది.
పార్టీలోనే కొనసాగుతున్నామని సమాధానం చెప్పిన ఎమ్మెల్యేలు ఏడాదిన్నర కాలంగా తెలంగాణ భవన్‌లో అడుగు పెట్టలేదు? మెడలో గులాబీ కండువా ఎందుకు వేసుకోవడం లేదు..? సీఎం రేవంత్ రెడ్డిని అభివృద్ధి కోసమే కలిసినట్లయితే ఆ పార్టీ కండువా ఎందుకు కప్పుకున్నారు..? అనే ప్రశ్నలు సంధించనున్నారు. అలాగే అలాగే ఫిరాయింపు ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరారంటూ కాంగ్రెస్ మంత్రులు చేసిన వ్యాఖ్యలు, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ గతంలో ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూను కూడా సాక్ష్యాలుగా సైతం కోర్టులో ఉంచాలని భావిస్తోంది. ఈ ఆధారాలను సుప్రీంకోర్టుకు సమర్పిస్తే ఫిరాయింపు ఎమ్మెల్యేలు చట్టం నుంచి తప్పించుకోలేరని వారిపై వేటు తప్పదని బీఆర్ఎస్ నాయకులు ధీమాగా ఉన్నారు.
ఏం చేద్దాం..! కాంగ్రెస్‌లో అంతర్మథనం..!
ఇటీవల పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో కడియం శ్రీహరి మినహా సీఎం రేవంత్‌రెడ్డితో మిగతా తొమ్మిది మంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. సుప్రీంకోర్టు తీర్పు, స్పీకర్ నోటీసులపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి కూడా హాజరయ్యారు. ఈ భేటీ తర్వాతే.. స్పీకర్ స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులకు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు యూటర్న్ తీసుకోవడం గమనార్హం.
తాము బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామని వివరణ ఇచ్చినప్పటికీ ఈ వాదనలు.. వివరణలు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలను ఆపకపోవచ్చన్న ఆందోళన కాంగ్రెస్ అధిష్టానం పెద్దల్లో వ్యక్తమవుతున్నట్లు సమాచారం. మరో వైపు స్పీకర్ నోటీసుల జారీ తర్వాత సదరు ఎమ్మెల్యేల్లో గుబులు పట్టుకుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు టెక్నికల్ అంశాలతో ఈ గండం నుంచి బయట పడాలని చూస్తున్నా.. అదంతా ఈజీకాదన్న అభిప్రాయం న్యాయ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.
ఉప ఎన్నికలపై బీఆర్ఎస్ ధీమా..! కేటీఆర్ టూర్ షెడ్యూల్ ఖరారు..!
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ పార్టీ కాస్త దూకుడుగా వ్యవహరిస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తప్పవని బీఆర్ఎస్ ధీమాగా ఉంది. అంతేకాదు 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు ఖాయమని కేటీఆర్ స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు స్పీకర్‌కు ఇచ్చిన వివరణపై సుప్రీంకోర్టు ఆంక్షలు తప్పవని బీఆర్ఎస్ భావిస్తోంది .ఈ క్రమంలోనే ఉప ఎన్నికల కోసం బీఆర్ఎస్ అప్పుడే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేసేందుకు నియోజకవర్గాల్లో పర్యటించాలని కేటీఆర్ యోచిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే మొదటగా శనివారం గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచే పర్యటనలు మొదలు పెట్టినట్లుగా పార్టీ వర్గాలు పేర్కొంటుండటం గమనార్హం.


