తీవ్ర సంక్షోభం… ఫ్లైట్ల రద్దుతో కుప్పకూలిన ఇండిగో షేర్లు..!
సిబ్బంది కొరత వేళ ఇండిగో సేవల్లో భారీ అంతరాయం
ఒక నెలలోనే 1,232 ఫ్లైట్లు క్యాన్సిల్
వరుసగా రెండో రోజు పతనమైన ఇండిగో షేర్లు
కాకతీయ, బిజినెస్ : దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థగా పేరుగాంచిన ఇండిగో ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా విమాన సేవలు దెబ్బతిన్న నేపథ్యంలో ప్రయాణికులు మాత్రమే కాదు, మార్కెట్‌లోని ఇన్వెస్టర్లు కూడా ఆందోళన చెందుతున్నారు. వరుస విమానాల రద్దుతో ఇప్పుడు షేర్ మార్కెట్ కుదేల్ అయింది.
దేశవ్యాప్తంగా గత రెండు రోజులుగా ఇండిగో ఫ్లైట్ సర్వీసుల్లో భారీ అంతరాయం చోటుచేసుకుంది. సిబ్బంది కొరత, అదనంగా కొత్త ఎఫ్‌డిటిఎల్ నిబంధనలు అమల్లోకి రావడం వల్ల సర్వీసులు దాదాపు స్థంభించిపోయాయి. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి ప్రధాన ఎయిర్‌పోర్టుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా కనిపించింది. గురువారం ఢిల్లీలో 30 ఫ్లైట్లు, హైదరాబాద్‌లో మరో 33 విమానాలు రద్దు అవ్వడంతో ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే నిలిచిపోయారు.
ఇదిలా ఉండగా, నవంబర్ నెలలో ఇండిగో మొత్తం 1,232 విమానాలను రద్దు చేసినట్లు డీజీసీఏ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. వీటిలో 755 విమానాలు సిబ్బంది కొరత, ఎఫ్‌డీటీఎల్ నిబంధనల వల్లే క్యాన్సిల్ అయినట్లు పేర్కొంది. దీనివల్ల అక్టోబర్‌లో 84.1 శాతంగా ఉన్న ఇండిగో ఆన్-టైమ్ పనితీరు (ఓటీపీ) నవంబర్‌కు 67.7 శాతానికి పడిపోయింది.
ఈ ఆపరేషనల్ అంతరాయాల ప్రభావం భారీగా షేర్ మార్కెట్‌పైనా కనిపిస్తోంది. ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేర్ విలువ వరుసగా రెండోరోజూ పతనమైంది. ఎన్ఎస్ఇ లో ఇండిగో షేర్ ధర ఏకంగా 3% కంటే ఎక్కువగా పడిపోవడం, ఒక్కో షేర్ ధర రూ.5,405కి క్షీణించడం ఇన్వెస్టర్లను షాక్‌కు గురిచేసింది. గత ఐదు రోజులలోనే ఇండిగో స్టాక్ వ్యాల్యూ దాదాపు 6% వరకు పడిపోయిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
రోజూ సగటున 2,200కుపైగా విమాన సర్వీసులు నిర్వహించే ఇండిగో లాంటి సంస్థ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొవడం ఏవియేషన్ రంగానికే పెద్ద హెచ్చరికగా మారింది. 90 దేశీయ, 40 అంతర్జాతీయ రూట్లలో సేవలు అందించే ఇండిగో, సిబ్బంది కొరతను వెంటనే పూడ్చుకోకపోతే, రాబోయే పండుగ సీజన్‌లో పరిస్థితి మరింత విషమించే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.మొత్తం మీద, ఫ్లైట్ల రద్దు – ప్రయాణికుల ఇబ్బందులు – షేర్ విలువ పతనం… ఇవన్నీ కలిసి ఇండిగోను తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి. ఈ సమస్యల్ని ఎలా పరిష్కరిస్తుందనేది ఇప్పుడు విమానయాన రంగం అంతా కళ్లప్పగించి చూస్తోంది.


