కొండబాలది దశాబ్దాల ప్రజా జీవితం
ప్రజల అవసరాలు తీర్చేందుకు చేయి చేయి కలిపి పని చేద్దాం
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తూ కండువా కప్పిన డిప్యూటీసీఎం, పీసీసీ ప్రెసిడెంట్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ సీనియర్ నేత కొండబాల కోటేశ్వర రావు తో పాటు భారీ సంఖ్యలో మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు గాంధీ భవన్ లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆధ్వర్యం లో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈసందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు విలేకరులతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యేగా, టిడిపి జిల్లా అధ్యక్షునిగా సర్పంచి స్థాయి నుంచి మొదలుకొని ఎమ్మెల్యేగా దశాబ్దాల కాలాలపాటు రాజకీయ అనుభవం కలిగిన కొండబాల కోటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానని డిప్యూటీ సీఎం తెలిపారు. స్థానిక సంస్థలు, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గా, టిఆర్ఎస్ హయాంలో కార్పొరేషన్ చైర్మన్ గా ఆయనకు చట్టసభలపై చక్కని అవగాహన ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు. అందరం కలిసి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాలను ప్రజా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజల వద్దకు తీసుకువెళ్దామని అన్నారు. ప్రజల అవసరాలు తెలుసుకొని తీర్చేందుకు చేయి చేయి కలిపి పని చేద్దామని డిప్యూటీ సీఎం అన్నారు.
సొంత ఇంటికి వచ్చిన కొండబాలకు స్వాగతం : పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
సొంత ఇంటికి తిరిగి వచ్చిన కొండబాల కోటేశ్వరరావుకు స్వాగతం తెలియజేస్తున్నానని, వారి చేరికతో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత పుంజుకుంటుందని డిప్యూటీ సీఎం తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కల ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్న వాటిలో చేర్చుకుంటున్నట్టు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. దేశ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్లో చేరుతున్నాను: మాజీ ఎమ్మెల్యే,కొండ బాల కోటేశ్వరావు దేశ రాష్ట్ర రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఆ పార్టీలో చేరుతున్నట్టు మాజీ ఎమ్మెల్యే కొండ బాల కోటేశ్వరావు ప్రకటించారు.
సుదీర్ఘ కాలంగా ఖమ్మం జిల్లాలో అనేక హోదాల్లో కాంగ్రెస్ పార్టీలో పనిచేసి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులతో సంబంధాలు కలిగి ఉన్నానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో జిల్లా జనరల్ సెక్రెటరీ స్థాయి వరకు వెళ్లానని, కాంగ్రెస్ అభ్యర్థిగా సమితికి సైతం పోటీ చేశానని కొండబాల తెలిపారు. ఈ దేశంలో పేద ప్రజల కోసం పని చేసింది కేవలం కాంగ్రెస్ పార్టీ ఏ అన్నారు, పేద ప్రజల కోసం పబ్లిక్ సెక్టార్ లో పరిశ్రమలను నెలకొల్పిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలకి దక్కింది అన్నారు. పేద వర్గాల సంక్షేమం కోసం పండిట్ జవహర్లాల్ నెహ్రూ గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు అమెరికా ప్రభుత్వం లో పనిచేస్తున్న SK డే ను భారతదేశానికి రప్పించి గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేశారని కొండబాల గుర్తు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు, ఈ దేశాన్ని బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయి ఈ నేపథ్యంలో తాను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి అభివృద్ధికి తన వంతు పాత్ర ఉండాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు కొండబాల ప్రకటించారు. తనతో పాటు ప్రస్తుతం కొంతమంది వచ్చారని రాబోయే రోజుల్లో పెద్ద సంఖ్యలో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారని కొండబాల తెలిపారు.


