బంగ్లాదేశ్‌కు డెడ్‌లైన్
ఈనెల 21లోపు తుది నిర్ణయాన్ని తెలపాలి
లేదంటే ప్రత్యామ్నాయాలు ఉన్నాయ్
ఐసీసీ అల్టిమేటం
కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్ : వచ్చే నెల నుంచి జరగనున్న టీ- 20 ప్రపంచ కప్‌లో పాల్గొనడంపై బంగ్లాదేశ్‌కు ఐసీసీ డెడ్‌లైన్ విధించినట్లుగా తెలుస్తోంది. ఈనెల 21లోపు తుది నిర్ణయాన్ని తెలపాలని బంగ్లా క్రికెట్ బోర్డుకు ఐసీసీ తెలియజేసినట్లు సమాచారం. మెగాటోర్నీకి చాలా తక్కువ సమయమున్న నేపథ్యంలో వేదికల తరలింపు సాధ్యం కాదని బీసీబీకి ఐసీసీ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ భారత్, శ్రీలంక వేదికలుగా జరగనుంది. అయితే భద్రతా కారణాలను సాకుగా చూపుతూ బంగ్లాదేశ్ తమ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు తరలించాలని ఐసీసీకి లేఖ రాసింది. ఫిబ్రవరి 7 నుంచి ప్రపంచ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంత తక్కువ సమయంలో వేదికల మార్పు అసాధ్యమని ఐసీసీ చెబుతూ వస్తోంది. అయినా బీసీబీ వైఖరిలో మార్పు రావడం లేదు. ఈ నేపథ్యంలో బీసీబీకి ఐసీసీ జనవరి 21ని డెడ్‌లైన్‌గా విధించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. ఢాకాలో జరిగిన సమావేశంలో ఈ డెడ్‌లైన్‌ను ఐసీసీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు విధించినట్లు తెలుస్తోంది.
రెండు సార్లు చర్చలు
ఈ వారంలో రెండుసార్లు ఐసీసీ, బీసీబీ మధ్య చర్చలు జరిగాయి. భారత్‌లో బంగ్లాదేశ్ జట్టుకు ఎలాంటి ముప్పు వాటిల్లే అవకాశం లేదని ఐసీసీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 21లోగా భారత్‌కు రావడానికి బీసీబీ ఒప్పుకోకపోతే, బంగ్లా టోర్నీ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. దీంతో ఐసీసీ ప్రత్యామ్నాయ జట్టును ఎంపిక చేసే అవకాశం ఉంది. ప్రస్తుత ర్యాంకింగ్స్ ప్రకారం స్కాట్లాండ్ టీమ్ బంగ్లాదేశ్ అవకాశాన్ని దక్కించుకుంటుంది. అయితే బంగ్లాలో హిందువులపై దాడుల నేపథ్యంలో ఆ దేశ పేస్ బౌలర్ ముస్తాఫిజుర్‌ను బీసీసీఐ ఐపీఎల్ నుంచి తప్పించడంతో ఈ వివాదానికి తెర లేచింది. బోర్డు ఆదేశాల మేరకు వేలంలో ముస్తాఫిజుర్‌ను కొనుగోలు చేసిన కోల్‌కతా ఫ్రాంచైజీ అతడిని జట్టులోంచి రిలీజ్ చేసింది. దీంతో భారత్‌లో ఆడడంపై భద్రతాపరమైన సాకులు చూపుతూ, ప్రతి చర్యగా వచ్చే నెలలో భారత్ వేదికగా జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ జట్టును ఇక్కడికి పంపేందుకు బీసీబీ నిరాకరిస్తోంది.


