కాకతీయ, గీసుగొండ: జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం ధర్మారం ప్రభుత్వ పాఠశాలలో డి-వార్మింగ్ డే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డా. సత్య శారదా దేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను అందజేశారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు నులిపురుగులు అడ్డంకిగా మారుతాయని, అందుకే సమయానికి మందులు వేసుకోవాలని సూచించారు. ఆగస్టు 10న వేసుకొని వారు ఆగస్టు 18న మాప్-అప్ డేలో తప్పక మందు తీసుకోవాలని కోరారు. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా వ్యాధులను నివారించవచ్చని చెప్పారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. సాంబశివరావు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, ఆగస్టు నెలల్లో ఈ కార్యక్రమం నిర్వహించి, 1 నుండి 19 సంవత్సరాల వయస్సు గల 1,96,160 మందికి మందులు అందజేస్తున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు హ్యాండ్‌వాష్ టెక్నిక్‌ను ఆరోగ్య సిబ్బంది ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి జ్ఞానేశ్వర్, డిప్యూటీ డిఎంహెచ్ఓలు డా. ప్రకాష్,డా. కొమురయ్య, తహసీల్దార్ ఎండి రియజుద్దీన్, మండల విద్యాధికారి వై.సాంబయ్య, వైద్యులు, పాఠశాల సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, ఆర్‌బీఎస్‌కే సిబ్బంది పాల్గొన్నారు.


