కేసీఆర్ క్యాంపు కార్యాలయం ముట్టడించిన డీసీసీ అధ్యక్షులు అంక్షారెడ్డి
– సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటంతో కాంగ్రెస్ శ్రేణుల నిరసన
– కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు వెంటనే ఇవ్వాలని డిమాండ్
– స్పందించకపోతే ఎర్రవల్లి ఫామ్ హౌజ్ ముట్టడిస్తామని హెచ్చరిక
– ఎమ్మెల్యేగా కొనసాగేందుకు కేసీఆర్‌కు నైతిక హక్కు లేదని ఆగ్రహం
– గజ్వేల్ ప్రజలకు అందుబాటులోకి రావాలని డిమాండ్
కాకతీయ, గజ్వేల్ : గజ్వేల్ ప్రజలను గాలికి వదిలేసిన కేసీఆర్‌కు ఎమ్మెల్యేగా కొనసాగేందుకు నైతిక హక్కు లేదు అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తూంకుంట అంక్షారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో లేకుండా వ్యవహరిస్తున్న ఆయన తీరును తీవ్రంగా ఖండించారు. గజ్వేల్ ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అంక్షారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు శనివారం కేసీఆర్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. ముందుగా పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి భారీ ర్యాలీగా బయలుదేరిన నాయకులు, కార్యకర్తలు క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకుని సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని బిగించి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ధర్నా నిర్వహించారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కేసీఆర్ ఇప్పటికే రూ.1.20 కోట్లకు పైగా వేతనం, అలవెన్సులు పొందినప్పటికీ ప్రజలకు సేవ చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని అంక్షారెడ్డి ఆరోపించారు. ప్రజల సొమ్మును వినియోగించుకుంటూ వారిని నిర్లక్ష్యం చేయడం అన్యాయమని విమర్శించారు. వెంటనే ఆయనను ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కుల పంపిణీ పూర్తిగా నిలిచిపోయిందని, ఇందుకు కేసీఆర్ నిర్లక్ష్యమే కారణమని స్పష్టం చేశారు.

గజ్వేల్ ప్రజల సమస్యల పరిష్కారంలో కెసిఆర్ పూర్తిగా విఫలమయ్యారని, ముంపు బాధితులను నట్టేట ముంచారని ఎద్దేవా చేశారు. దమ్ముంటే నిర్వాసిత గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని సవాల్ విసిరారు. ఇప్పటికైనా స్పందించి ప్రజల సమస్యలను పరిష్కరించాలి. లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎర్రవల్లి ఫామ్ హౌజ్‌ను ముట్టడించేందుకు వెనుకాడం అని హెచ్చరించారు. అలాగే కేసీఆర్ క్యాంపు కార్యాలయం అక్రమాలకు అడ్డాగా మారిందని ఆరోపిస్తూ, జిల్లా కలెక్టర్ వెంటనే ఆ కార్యాలయాన్ని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు నరేందర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్లు సర్దార్ ఖాన్, ప్రభాకర్ గుప్త, మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, సుఖేందర్ రెడ్డి, కనకయ్య గౌడ్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు అశోక్ రెడ్డి, వెంకటేష్, జిల్లా మైనార్టీ సెల్ నాయకుడు సమీర్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు, ఇతర నాయకులు సత్యలక్ష్మి యాదగిరి, సంతోష రాములు గౌడ్, నరసింహారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్, సారిక శ్రీనివాస్ రెడ్డి, జంగం రమేష్ గౌడ్, కరుణాకర్ రెడ్డి, ఆస్గర్, అజహర్ తదితరులు పాల్గొన్నారు.


