కాకతీయ, నేషనల్ డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లా మాలేవాహి పోలీస్ స్టేషన్ పరిధిలో నక్సలైట్లు అమర్చిన ప్రెషర్ IED పేలడంతో ఇద్దరు CRPF జవాన్లు గాయపడ్డారు. ఈ రోజు ఉదయం CRPF 195 బెటాలియన్ బృందం, మాలేవాహి ప్రధాన కార్యాలయం నుండి సత్ధర్–మాలేవాహి మధ్య నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ కోసం బయలుదేరింది. ఈ ఆపరేషన్ లక్ష్యం ప్రాంతాధిపత్యాన్ని సాధించడం, అలాగే నక్సలైట్లు అమర్చిన మందుపాతరలను గుర్తించి తొలగిస్తున్న క్రమంలో ఈ పేలుడు జరిగింది.
అయితే ఉదయం సుమారు 10:30 గంటల సమయంలో, సత్ధర్ వంతెనకు కేవలం 800 మీటర్ల దూరంలో బృందం ముందుకు కదులుతున్న సమయంలో, నక్సలైట్లు ముందుగానే అమర్చిన ప్రెషర్ IED పేలింది. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఇన్‌స్పెక్టర్ దివాన్ సింగ్ గుర్జార్, కానిస్టేబుల్ ఆలం మునేష్ అనే జవాన్లను వెంటనే సహచర జవాన్లు , దంతేవాడ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం, మెరుగైన వైద్య సదుపాయాల కోసం వారిని విమానంలో రాయ్‌పూర్ హై సెంటర్ కి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ ఘటన తరువాత ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు అధిక అప్రమత్తం అయ్యాయి. నక్సలైట్ల కదలికలు, భూసురంగాల ముప్పు ఎక్కువగా ఉన్నందున, అధికారులు అదనపు దళాలను మోహరించారు. ప్రాంతాన్ని పూర్తిగా సోదా చేసి, మిగతా మందుపాతరలను నిర్వీర్యం చేసే చర్యలు కొనసాగుతున్నాయి. CRPF అధికారులు గాయపడిన జవాన్ల పరిస్థితి స్థిరంగా ఉందని, వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందించనున్నట్లు తెలిపారు.


