హుస్నాబాద్ మునిసిపల్ చైర్మన్‌గా దండి లక్ష్మి
వైస్ చైర్మన్‌గా చిత్తరి పద్మ
20 వార్డుల్లో 16 గెలిచిన కాంగ్రెస్‌కు ఏకపక్ష విజయం
ఘనంగా ప్రమాణ స్వీకారం చేసిన నూతన ప్రజాప్రతినిధులు
మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపిన నేతలు
పట్టణ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని హామీ
కాకతీయ, హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు ఏకపక్షంగా ముగిశాయి. మున్సిపల్ చైర్మన్‌గా 14వ వార్డు సభ్యురాలు దండి లక్ష్మి, వైస్ చైర్మన్‌గా 7వ వార్డు సభ్యురాలు చిత్తరి పద్మ ఎన్నికయ్యారు. సోమవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఎన్నికల అధికారుల సమక్షంలో ఇరువురు ప్రజాప్రతినిధులు ఘనంగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. హుస్నాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 16 వార్డుల్లో ఘన విజయం సాధించడంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఏకపక్షంగా మారింది. స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పాలనను చేపట్టింది. ప్రమాణ స్వీకారం అనంతరం నూతన చైర్మన్ దండి లక్ష్మి, వైస్ చైర్మన్ చిత్తరి పద్మ మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌కు, కౌన్సిలర్లకు కృతజ్ఞతలు తెలిపారు. పట్టణ అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు నూతన చైర్మన్, వైస్ చైర్మన్లకు అభినందనలు తెలియజేశారు. హుస్నాబాద్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామని నాయకులు పేర్కొన్నారు



