డీఏల చెల్లింపు పూర్తి చేయాలి
తక్షణమే ప్రభుత్వం స్పందించాలి
తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎం.ఏ. ఖాద్రీ
కాకతీయ, కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై మానవీయ దృక్పథంతో తక్షణమే స్పందించాలని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎం.ఏ. ఖాద్రీ కోరారు. ఉద్యమాలు, ధర్నాలు, నిరసనలు కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వ స్పందన లేకపోవడం ఆందోళనకరమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తండ్రి స్థానంలో నిలబడి ఉద్యోగుల సమస్యలను పరిశీలించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ఐదు విడతల డీఏ పెండింగ్
ప్రస్తుతం జనవరి–2023 వరకే డీఏ అమలులో ఉందని, ఆ తర్వాత ఐదు విడతల డీఏ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని ఖాద్రీ తెలిపారు. జనవరి–2023 డీఏను కేంద్రం 24 మార్చి 2023న మంజూరు చేయగా, రాష్ట్రం 3.64 శాతం అమలు చేసి మొత్తం 30.03 శాతంగా చెల్లిస్తోందని చెప్పారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జి.ఓ. ఎంఎస్. నెం.78 (13 జూన్ 2025) ద్వారా జారీ అయ్యాయని వివరించారు.
30 నెలలుగా బకాయిల భారం
జూలై–2023 డీఏ (3.64%)ను కేంద్రం 18 అక్టోబర్ 2023న మంజూరు చేసినప్పటికీ ఇప్పటివరకు రాష్ట్రం అమలు చేయలేదని తెలిపారు. జనవరి–2024 (మొత్తం 37.31%), జూలై–2024 (40.04%), జనవరి–2025 (41.86%), జూలై–2025 (44.59%) డీఏలు కూడా వరుసగా 24, 18, 12, 6 నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. డిసెంబర్–2025 నాటికి మొత్తం 14.56% డీఏ బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు.
₹70,000 బేసిక్ పే ఉన్న ఉద్యోగికి ఐదు విడతల డీఏ కలిపి సుమారు ₹1,98,744 బకాయిలు ఉన్నాయని ఖాద్రీ వివరించారు. నెలవారీగా రావాల్సిన జీత పెరుగుదల సుమారు ₹10,192 అయినప్పటికీ ఉద్యోగులు పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
విడతల వారీగా అయినా చెల్లించాలి
ఉద్యోగులు ప్రభుత్వానికి వెన్నెముకలని, వారి ఆర్థిక భద్రతను నిర్లక్ష్యం చేయరాదని ఖాద్రీ స్పష్టం చేశారు. ఖజానాపై భారం తగ్గేలా విడతల వారీగా అయినా డీఏ బకాయిలను విడుదల చేయాలని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యోగులు–ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరారు.


