- కరీంనగర్ వీధుల్లో సీపీ గౌష్ ఆలం రైడ్
కాకతీయ, కరీంనగర్ : పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో శనివారం 20 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీని నిర్వహించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుండి ర్యాలీని కమిషనర్ గౌష్ ఆలం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు అందరికీ స్ఫూర్తి కావాలన్నారు. ఈ ర్యాలీలో కరీంనగర్ రన్నర్స్, సైక్లిస్ట్ అసోసియేషన్ సభ్యులు, విద్యార్థులు, డాక్టర్లు, పౌరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం సీపీ గౌష్ ఆలం ర్యాలీలో పాల్గొన్న వారికి అమరవీరుల దినోత్సవ ప్రాముఖ్యతను వివరించి, మెడల్స్ అందజేశారు. అమరవీరుల వారోత్సవాలను అక్టోబర్ 31 వరకు వివిధ కార్యక్రమాలతో నిర్వహిస్తామని, ముఖ్యంగా విద్యార్థులు ఈ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనాలని పోలీస్ కమిషనర్ కోరారు. కార్యక్రమంలో అదనపు డీసీపీలు వెంకటరమణ, భీంరావు, ఏసీపీలు వెంకటస్వామి, విజయకుమార్, యాదగిరి స్వామి, మాధవి, ఇన్స్పెక్టర్లు, ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి, కమిషనరేట్ రన్నర్స్, సైక్లిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహేష్ పాసుల, డాక్టర్ అజయ్ ఖండాల, డాక్టర్ కిరణ్, తదితరులు పాల్గొన్నారు.


