- హుజురాబాద్ ఎస్సై యూనస్ అలీ
కాకతీయ, హుజురాబాద్ : పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉండాలని హుజూరాబాద్ సబ్–ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎస్సై) యూనస్ అలీ సూచించారు. గురువారం ఉదయం హుజూరాబాద్ పట్టణంలోని హైస్కూల్ మైదానంలో వాకర్స్‌కు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై యూనస్ అలీ మాట్లాడుతూ.సైబర్ నేరగాళ్లు ప్రతిరోజూ కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. పోలీసులు ప్రజల భద్రత కోసం చర్యలు తీసుకుంటున్నప్పటికీ, వ్యక్తిగత అప్రమత్తత మాత్రమే ప్రధాన రక్షణ అని చెప్పారు. లాటరీ గెలిచారు, ఉచిత ఆఫర్ వచ్చింది వంటి సందేశాల వెనుక మోసం దాగి ఉంటుందని, ఇలాంటి వాటి ద్వారా వ్యక్తిగత సమాచారం లేదా డబ్బును కాజేయడమే లక్ష్యమని ఆయన హెచ్చరించారు.
మేము సీబీఐ లేదా పోలీసులు మాట్లాడుతున్నాం అని చెప్పే నకిలీ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మీ కుమారుడు నేరం చేశాడు, డబ్బు పంపిస్తే కేసు మాఫీ చేస్తాం అంటూ పోలీసుల పేరుతో వచ్చే కాల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదని, ప్రభుత్వ సంస్థలు ఎప్పుడూ డబ్బు డిమాండ్ చేయవని గుర్తు చేశారు. అపరిచితులు లేదా అనుమానాస్పద కాల్స్, సందేశాలకు మీ బ్యాంక్ వివరాలు లేదా వ్యక్తిగత సమాచారం ఇవ్వకండి.ఫోన్‌లో ఓటీపీ (ఓటీపీ)ను ఎవరికి చెప్పకండి. ఓఎల్ఎక్స్ , పేటీఎం , ఫోనెప్, గూగుల్ పే వంటి యాప్‌ల పేరుతో కేవైసీ అప్‌డేట్ చేయాలి అంటూ వచ్చే కాల్స్, లింక్‌లను నమ్మకండి. ఎటువంటి అనుమానాస్పద లావాదేవీ జరిగినా వెంటనే సైబర్ హెల్ప్‌లైన్ 1930 లేదా స్థానిక పోలీసులను సంప్రదించాలని సూచించారు.


