కార్పొరేట్ మహిళకు సైబర్ షాక్!.. రూ.1.20 కోట్లు గల్లంతు
డైరెక్టర్ ఫోటోతో ఫేక్ వాట్సాప్ అకౌంట్
అకౌంటెంట్‌ను నమ్మించి రూ.1.20 కోట్లు ట్రాన్స్‌ఫర్
రెండోసారి మెసేజ్‌తో బయటపడిన మోసం
రంగంలోకి సైబర్ పోలీసులు.. కేరళలో నిందితుడు ఉన్నట్లు గుర్తింపు
కాకతీయ, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ మహిళ వ్యాపారవేత్తకు రూ.1.20 కోట్ల సైబర్ మోసం జరగడం సంచలనం సృష్టించింది. సుమారు 18 కంపెనీలకు డైరెక్టర్‌గా ఉన్న ఆ మహిళ పేరు, ఫోటోతో ఒక ఫేక్ వాట్సాప్ నంబర్ సృష్టించిన సైబర్ నేరగాళ్లు… ఆమె కంపెనీ అకౌంటెంట్‌ను టార్గెట్ చేశారు. “మీటింగ్‌లో ఉన్నాను… కాల్స్ ఎత్తలేను… వెంటనే ఈ ఖాతాకు రూ.1.20 కోట్లు పంపండి” అంటూ వచ్చిన మెసేజ్‌ను నిజమని నమ్మిన అకౌంటెంట్… ఒకే లావాదేవీలో మొత్తం డబ్బును ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఈ నెల 17న అదే విధంగా మరోసారి మెసేజ్ రావడంతో అకౌంటెంట్ అనుమానం వ్యక్తం చేశాడు. భారీ మొత్తం కావడంతో నేరుగా తన యజమానిని సంప్రదించాడు. అప్పుడు అసలు విషయం బయటపడింది. తాను ఎలాంటి మెసేజ్ చేయలేదని ఆ మహిళ చెప్పడంతో ఇద్దరూ షాక్‌కు గురయ్యారు.
వెంటనే ఫిర్యాదు… దర్యాప్తు వేగం
మోసాన్ని గుర్తించిన వెంటనే బాధితురాలు 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. అనంతరం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడి ట్రేసింగ్ ప్రారంభించారు. ప్రస్తుతం నిందితుడు కేరళలో ఉన్నట్లు గుర్తించి… ప్రత్యేక బృందాలను అక్కడికి పంపించారు. వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోలు, పేర్లు చూసి నమ్మకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా భారీ మొత్తాల డబ్బు బదిలీ చేసే ముందు సంబంధిత వ్యక్తితో నేరుగా మాట్లాడి ధృవీకరించుకోవాలని సూచిస్తున్నారు. ఒక్క వాట్సాప్ మెసేజ్‌తో కోట్ల రూపాయలు పోగొట్టుకున్న ఈ ఘటన… సైబర్ నేరాల తీవ్రతను మరోసారి గుర్తు చేసింది. అప్రమత్తతే రక్షణ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


