కరెంట్ లేక ఎంజీఎంలో సేవలకు ఆటంకం
నిలిచిన సిటీ స్కాన్, ఫిజియోథెరపీ పరీక్షలు
సమస్యలతో సతమతమవుతున్న ప్రభుత్వ పెద్ద ఆస్పత్రి
సేవలు అందక నిరాశతో వెనుదిరిగిన రోగులు
కాకతీయ, వరంగల్ : వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రిలో సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే సిబ్బంది కొరత, సౌకర్యాల లేమి, మందుల కొరతతో రోగులు ఇబ్బందులు పడుతుండగా, తాజాగా కరెంట్ అంతరాయం మరో కొత్త సమస్యగా మారింది. గురువారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో పలు వైద్య సేవలు పూర్తిగా స్తంభించాయి. కరెంట్ లేకపోవడంతో సిటీ స్కాన్, ఎంఆర్ఐ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్, ఫిజియోథెరపీ వంటి కీలక నిర్ధారణ సేవలు నిలిచిపోయాయి. ఈ సేవల కోసం ఆస్పత్రికి వచ్చిన పలువురు రోగులకు కరెంట్ లేదని తెలియజేస్తూ సిబ్బంది వెనుదిరగమని సూచించారు. ముందస్తు సమాచారం లేకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ముఖ్యంగా అత్యవసర వైద్య సేవలు అవసరమైన రోగులు ఇబ్బందులు పడినట్లు సమాచారం. ఇప్పటికే ఎంజీఎం ఆస్పత్రిపై సౌకర్యాల కొరత, నిర్వహణ లోపాలపై విమర్శలు వినిపిస్తుండగా, తాజా కరెంట్ సమస్యతో పరిస్థితి మరింత దిగజారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాలకులు, అధికారులు మారుతున్నా ఆస్పత్రి పరిస్థితిలో మాత్రం ఆశించిన మార్పు కనిపించకపోవడం రోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ అతిపెద్ద ఆస్పత్రిలో ఇలాంటి మౌలిక సమస్యలు తలెత్తడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


