జనసంద్రంగా మేడారం
తల్లీ సారలమ్మ కోసం ఎదురు చూపు
సాధారణ క్యూలైన్లు దాటి మేడారం రోడ్లపైన బారులు
ఐటీడీఏ గెస్ట్ హౌస్ ప్రాంతంలో తీవ్ర రద్దీ
కిలోమీటర్ల మేర క్యూ లైన్లు.. రోడ్లపై నిలిచిపోయిన వాహనాలు
జాతరలో చిక్కుకుపోతున్న అంబులెన్సులు
జాకారం నుంచి మేడారం వరకు వాహనాల రద్దీ
ట్రాఫిక్ క్లియరెన్స్‌కు పోలీసుల అవస్థలు
కాకతీయ, మేడారం బృందం : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ఖ్యాతి పొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర నేడు అధికారికంగా ప్రారంభం కావడంతో ములుగు జిల్లా అరణ్య ప్రాంతం భక్తులతో కిక్కిరిసిపోయింది. జాతర తొలి రోజే లక్షలాది మంది తరలిరావడంతో మేడారం పరిసరాల్లో ట్రాఫిక్, రద్దీ పరిస్థితి తీవ్ర స్థాయికి చేరింది. జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను, కొండాయి నుంచి గోవిందరాజును, పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజును ఆదివాసీ సంప్రదాయాల నడుమ గద్దెలపైకి తీసుకువచ్చే కీలక ఘట్టం ప్రారంభమైంది. వనదేవతల ఆగమనాన్ని దర్శించుకోవాలనే ఉత్సాహంతో భక్తులు భారీ సంఖ్యలో మేడారం చేరుకున్నారు.

ట్రాఫిక్ జామ్‌తో నిలిచిన రహదారులు
భక్తుల తాకిడి పెరగడంతో జాకారం నుంచి మేడారం వరకు సుమారు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మేడారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన క్యూలైన్లు నిండిపోవడంతో ఐటీడీఏ గెస్ట్ హౌస్ ప్రాంతం ముందు ఉన్న రోడ్లపై భక్తులు నిల్చున్నారు. అక్కడి రహదారులు పూర్తిగా బ్లాక్ అయ్యాయి. గంటల తరబడి వాహనాలు ఒకే చోట నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణ క్యూ లైన్లు పూర్తిగా నిండిపోవడంతో భక్తులు ప్రధాన రహదారులపైకి వచ్చి మేర బారులు తీరారు. దర్శనం కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుండటంతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు.

అంబులెన్సులకు ఆటంకం
రోడ్లన్నీ వాహనాలతో నిండిపోవడంతో అత్యవసర సేవలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. కొన్ని చోట్ల అంబులెన్సులు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయినట్లు సమాచారం. ఈ పరిస్థితిపై అధికారులు అప్రమత్తమయ్యారు. ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ చేపట్టడంతో పాటు ఏఐ సాంకేతికతను వినియోగిస్తున్నారు. భక్తులు ప్రత్యామ్నాయ పార్కింగ్ స్థలాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. రద్దీని తట్టుకోవడానికి ఆర్టీసీ ప్రతి నిమిషానికి నాలుగు బస్సులను నడుపుతోంది. సమయం ఆదా చేసుకోవాలనుకునే భక్తుల కోసం హనుమకొండ నుంచి మేడారానికి హెలికాప్టర్ సర్వీసులు కూడా అందుబాటులోకి తెచ్చారు. మేడారం జాతర తొలి రోజే భక్తుల రాకతో జనసంద్రంగా మారింది. సాయంత్రం వరకు లక్షలాది మంది భక్తులు రానుండటంతో రద్దీ మరింత పెరిగే అవకాశముండటంతో అధికారులు అప్రమత్తంగా ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు.




