మేడారం గద్దెల వద్ద జనసంద్రం
సమ్మక్క గద్దెకు చేరడంతో పెరిగిన రద్దీ
వీవీఐపీ–వీఐపీ క్యూలతో కిక్కిరిసిన ప్రాంగణం
కాకతీయ, మేడారం బృందం : మేడారంలో వనదేవతల దర్శనానికి భక్తుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది. గురువారం సమ్మక్కను గద్దెకు తీసుకురావడంతో జాతర ఉత్సాహం తారాస్థాయికి చేరింది. శుక్రవారం ఉదయం నుంచే లక్షలాది మంది భక్తులు అమ్మవార్ల దర్శనం కోసం మేడారం వైపు తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో క్యూల్లో బారులు తీరడంతో గద్దెల ప్రాంగణం జనసంద్రంగా మారింది. సాధారణ దర్శనాలతో పాటు వీవీఐపీ, వీఐపీ దర్శనాల క్యూలు సైతం కిక్కిరిసిపోతున్నాయి. భక్తుల రాకపోకలతో ప్రాంగణమంతా కోలాహలంగా మారగా, పోలీసు-పాలనా యంత్రాంగం ట్రాఫిక్, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించింది. శుక్రవారం రాత్రి వరకు భక్తుల సంఖ్య మరింత భారీగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో శుక్రవారం రాత్రి నుంచి జాతర ముగించుకుని తిరుగు ముఖం పట్టే భక్తుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీంతో వచ్చే భక్తులు, వెళ్లే భక్తుల సంఖ్య దాదాపు సమానంగా ఉండొచ్చని అంచనా. ఈ నేపథ్యంలో గద్దెల ప్రాంతం, పరిసర మార్గాల్లో రద్దీ మరింత పెరిగే అవకాశముందని పేర్కొంటున్నారు.




