అకాల వర్షంతో పంటలకు దెబ్బ
నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి
కాకతీయ, జగిత్యాల : జిల్లాలో అకాల వర్షాలు, ఈదురుగాలులతో కోత దశలో ఉన్న పంటలు తీవ్రంగా దెబ్బతినడంతో రైతులు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు.
సారంగాపూర్ మండలంలోని అర్పపల్లి, పెంబట్ల గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఆయన, లక్ష్మీదేవిపల్లిలో రైతు రవి నాయక్‌కు చెందిన బీరకాయ తోటను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో మాట్లాడిన జీవన్‌రెడ్డి, జిల్లాలో మొక్కజొన్న పంట అధికంగా ఉండగా అకాల వర్షాలతో అనేక ప్రాంతాల్లో పంటలు నేలకొరిగాయని తెలిపారు. రైతులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం తక్షణమే స్పందించి కలెక్టర్ ద్వారా నష్టం అంచనా వేయించి చర్యలు చేపట్టాలని కోరారు. మొక్కజొన్న, నువ్వులు, కూరగాయల పంటలు, మామిడి తోటలు పూర్తిగా దెబ్బతినడంతో ఎకరాకు రూ.20–30 వేల వరకు పెట్టుబడి నష్టపోయారని పేర్కొన్నారు. మార్కెట్లో మొక్కజొన్న ధర క్వింటాల్‌కు రూ.1800–1900 మాత్రమే ఉండటంతో ప్రతి క్వింటాల్‌కు సుమారు రూ.500 వరకు నష్టం వస్తోందన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోరినా ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. మార్క్‌ఫెడ్ ద్వారా వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని, లేకపోతే దళారులు లాభపడతారని హెచ్చరించారు. పంటల బీమా అమలు లేక రైతులు పూర్తిగా నష్టపోతున్నారని, తక్షణమే సర్వేలు చేసి కనీసం ఎకరాకు రూ.20 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా సకాలంలో అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఎలాంటి ఆంక్షలు లేకుండా అమలు చేయాలని కోరారు. మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి రైతులను ఆదుకోవాలని జీవన్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.


