సాగునీరు అందక ఎండిపోతున్న పంటలు
చెక్ డ్యాములు నింపి పంటలను కాపాడాలి
రైతుల సమస్యలపై దృష్టి సారించాలి
మంత్రి ఉత్తమ్ ను కోరిన ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి
కాకతీయ,రాయపర్తి/ పాలకుర్తి : పాలకుర్తి నియోజకవర్గానికి సాగునీరు అందక పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెక్ డ్యాములు నింపి పంటలను కాపాడాలని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి కోరారు. గురువారం రాష్ట్ర పౌర సరఫరాల, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డితో హైదరాబాదులో ఎమ్మెల్యే భేటీ అయ్యారు. సాగునీటి కొరతతో పంటలు ఎండిపోతున్నాయని, సకాలంలో సాగునీరు అందించాలన్నారు. వర్షాలు కురుస్తున్నప్పటికీ చెక్ డ్యామ్ లలో నీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. రైతుల నీటి సమస్య పరిష్కారానికి జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని హాట్యా తండాలోనే కాకతీయ కెనాల్ వద్ద స్లూయిస్ గేట్ (ఓటీ ) ఏర్పాటుచేసి నీటిని మళ్లించాలన్నారు. తద్వారా నియోజకవర్గంలోని పోచారం, బొమ్మకల్లు, కర్కాల, చీకటాయపాలెం గ్రామాలలో చెక్ డ్యామ్ లు నిండుతాయన్నారు. ఈ నేపథ్యంలో సాగునీరు పుష్కలంగా అంది అధిక దిగుబడితో పాటు రైతులు ఆర్థికంగా బలపడతారని అన్నారు.


