-యూరియా కొరతతో పంటకు భారీ నష్టం
– 15 రోజుల క్రితం టోకెన్ల పంపిణీ
-పట్టించుకోని వ్యవసాయ అధికారులు
– పనులు మానుకొని పరేషాన్
– క్యూ లైన్ లో రైతుల మధ్య తోపులాట
– రాయపర్తి మండలంలో జాతీయ రహదారిపై రైతుల ఆందోళన
– సుమారు గంటపాటు రాకపోకలకు అంతరాయం
కాకతీయ, రాయపర్తి : యూరియా సరైన సమయంలో అందక పంట సాగు సన్నగిల్లుతుందనే ఆగ్రహంతో రైతులు మంగళవారం వరంగల్ -ఖమ్మం(563) జాతీయ రహదారిపై రాయపర్తి మండలంలోని రాజీవ్ చౌరస్తాలో పెద్ద ఎత్తున ధర్నా దిగారు.గత 15 రోజుల క్రితం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద టోకెన్లు పంపిణీ చేశారని, ఈ రోజు వరకు ఆయా టోకెన్లకు యూరియా బస్తాలు పంపిణీ చేసిన దాఖలు లేవని రైతులు వాపోయారు.
సోమవారం సాయంత్రం 800 బస్తాలు స్థానిక పీఏసీఎస్ లో దిగుమతి అయిన విషయం రైతులు తెలుసుకున్నారు.దీంతో మంగళవారం ఉదయం 5 గంటల నుంచే సహకార సంఘం వద్ద రైతులు బారులు తీరారు. క్యూ లైన్ లో కాసేపు రైతుల మధ్య తోపులాట జరిగింది. తెల్లవారుజాము నుంచి గంటల తరబడి పడికాపులు కాసినప్పటికీ వ్యవసాయ అధికారులు యూరియా పంపిణీ చేయకపోవడంతో రైతులు పెద్ద ఎత్తున జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు.
సుమారు గంటసేపు రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.మాకు యూరియా కావాలి అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ నేపద్యంలో హుటావుటిన స్థానిక ఎస్సై ముత్యం రాజేందర్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు.రైతులతో మాట్లాడే ప్రయత్నం చేయగా రైతులు,పోలీసుల మధ్య వాగ్వాదాం ఏర్పడడంతో రహదారిపై కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయినప్పటికీ ఎస్సై రాజేందర్ రైతులను సముదాయించి ధర్నాను విరమింప చేశారు.


