బయట మల వ్యర్థాలు పారేస్తే క్రిమినల్ కేసులు
సెప్టిక్ ట్యాంక్ వాహన యజమానులపై కఠిన చర్యలు
కంపోస్ట్ ఎరువు విక్రయానికి పార్కుల్లో ప్రత్యేక స్టాళ్లు
కాకతీయ, వరంగల్ : నగరంలో మల వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో డంప్ చేస్తే సంబంధిత సెప్టిక్ ట్యాంక్ వాహన యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వరంగల్ నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ స్పష్టం చేశారు. శనివారం బల్దియా కార్యాలయంలో శానిటేషన్, ఇంజినీరింగ్, హార్టికల్చర్ విభాగాల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె కీలక ఆదేశాలు జారీ చేశారు. చెత్త తరలింపు వాహనాల మరమ్మతులను వేగంగా పూర్తి చేయాలని, స్వచ్ఛ ఆటోలు, రోబో వాహనాలు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వాహనాల నిర్వహణ వివరాలను ప్రత్యేక యాప్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు. అక్రమంగా మల వ్యర్థాలు పారబోసే వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని, సెలవు రోజుల్లోనూ తనిఖీలు ముమ్మరం చేయాలని కమిషనర్ తెలిపారు. పట్టుబడిన ట్యాంకర్ యజమానులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోజుకు కనీసం 70 నుంచి 80 ట్యాంకర్లు వ్యర్థాలు శుద్ధి కేంద్రానికి చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మూడు సంవత్సరాలు దాటిన సెప్టిక్ ట్యాంకులను తప్పనిసరిగా శుభ్రం చేయాలని, లేకపోతే భూగర్భ జలాలు కలుషితమవుతాయని హెచ్చరించారు. నగరంలో తయారవుతున్న కంపోస్ట్ ఎరువును రైతులకు విక్రయించేందుకు పార్కుల్లో ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.


