నేటి నుంచి ఇంటింటికీ సీపీఐ
ఏప్రిల్ 10 వరకు గ్రామాల్లో కొనసాగింపు
సీపీఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు
కాకతీయ, బోనకల్ : ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కార దిశగా కార్యాచరణ చేపట్టేందుకు ఇంటింటికీ సిపిఐ కార్యక్రమం నిర్వహిస్తున్నామని సిపిఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు తెలిపారు. ప్రజలను చైతన్యవంతం చేయడమే లక్ష్యమన్నారు. మంగళవారం ముష్టికుంట్లలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యంగల ఆనందరావు మాట్లాడుతూ, ఏప్రిల్ 1 నుంచి పది రోజుల పాటు ప్రతి గ్రామం, ప్రతి వార్డులో ప్రజల సమస్యలను సేకరించనున్నట్లు తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. గోవిందాపురం ఎల్ గ్రామంలో తోట రామాంజనేయులు, ఏనుగు గాంధీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. అదే రోజు లక్ష్మీపురం గ్రామంలో కూడా కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఆర్థిక సహాయం, ఆటో కార్మికులకు చేయూత అందించాలని కోరారు. చిరువ్యాపారులకు కాంప్లెక్స్‌లు నిర్మించాలని సూచించారు. నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆకెన పవన్, బొడ్డుపల్లి వెంకటేశ్వర్లు, కొంగర భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.


